‘కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అమలుచేస్తాం’.. ఇదీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. 18 నెలల అనంతరం ఇప్పుడు మాటమార్చింది. ఇప్పుడు బీసీలకు 42% కోటా ఇచ్చుడు సంగతేమో కానీ, ఇప్పటివరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లకూ ముప్పు తెచ్చిపెడుతున్నది.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నది. కేంద్రాన్ని సాకుగా చూపి స్థానికసంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా కాకుండా, పార్టీపరంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్థానికసంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ర్టాల కులగణనకు చట్టబద్ధత లేదంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ అమలు సాధ్యాసాధ్యాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. తుదకు చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగానే రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో బీసీలకు కాంగ్రెస్ మరోసారి మొండిచెయ్యి చూపుతున్నది. వెరసి స్థానిక సంస్థల్లో బీసీలకు పార్టీ కోటానే శరణ్యంగా మారనున్నది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్పష్టత ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చింది. జనాభా గణన చట్టం-1948 ప్రకారం జనాభా గణన, కులగణన చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఇదే విషయాన్ని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్షా స్వయంగా ప్రకటించారు. పలు రాష్ర్టాలు రాజకీయాల కోసం కులగణన చేస్తున్నాయని, కానీ అది చెల్లబోదని కుండబద్దలు కొట్టారు. ఈ వాస్తవాలు, కేంద్రం ఆమోదించదని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను బురిడీ కొట్టించింది. అధికారం చేపట్టిన తరువాత గత సంవత్సరం నవంబర్లో దాదాపు రూ.160 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించింది. సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 మంది (46.25%), బీసీ ముస్లింలు 35,76,588 (10.08%), ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,05,929 (10.45%), ఓసీ ముస్లింలు 8,80,424 (2.48%), ఇతర ఓసీలు 44,21,115 (13.31%) మంది ఉన్నట్టు నివేదించింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టిన ప్రభుత్వం.. కులాలు, ఉపకులాల వారీగా వివరాలను గోప్యంగా ఉంచింది. ఆ గణాంకాల ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కేంద్రం ఆమోదించదని తెలిసీ గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆ తరువాత మళ్లీ బీసీ బిల్లుల ఊసెత్తలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కి ఆ నెపాన్ని కేంద్రంపై మోపడమే కాంగ్రెస్ అసలు ఉద్దేశమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రూ.160 కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.
2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా అప్పటి పంచాయతీరాజ్ అధికారులు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున స్థానాలు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ నిర్వాకంతో ఇప్పుడు ఆ రిజర్వేషన్ కూడా లేకుండా పోయే ముప్పు ఏర్పడింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు ఏమీలేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6)ను ప్రకారం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లను కలిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ, ర్యాండమ్ తదితర అశాస్త్రీయ పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తుండగా ప్రతిసారీ వాటిపై న్యాయవివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ట్రిపుల్-టీ పేరిట స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అందులో మొదటిది.. స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేయాలి. రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడవది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లన్నీ కలిపి 50% మించకూడదు.
వాటినే ట్రిపుల్-టీ అంటారు. ఆ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రతోపాటు పలు రాష్ర్టాల్లో స్థానికసంస్థల ఎన్నికలను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ స్థానాలుగానే మార్చాలని స్పష్టంచేసింది. సూటిగా చెప్పాలంటే డెడికేటెడ్ కమిషన్ నివేదిక లేకుండా స్థానికసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు ఇకపై ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఆ కమిషన్ సైతం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కులగణన గణాంకాలకు సాధికారత లేకపోవడంతో కమిషన్ కల్పించిన 42% రిజర్వేషన్ చెల్లకుండా పోతున్నది. ప్రస్తుతం గతంలో ఉన్న 23% రిజర్వేషన్ను కల్పించాలన్నా డెడికేటెడ్ కమిషన్ మళ్లీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందుకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీలకు సైతం స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రస్తుతం అమలవుతున్న 23% రిజర్వేషన్ కూడా ఉండబోదనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై నెపం మోపి పార్టీ పరమైన రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు ప్రధానంగా ఓటర్ జాబితా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. మహారాష్ట్ర సైతం అదేబాటలో కొనసాగుతున్నది. బీహార్, కర్ణాటక రాష్ర్టాలు సమగ్ర కుల సర్వేలను నిర్వహించాయి. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కసరత్తు చేసినా అవి ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఒడిశా ప్రభుత్వం మాత్రం కమిషన్ను ఏర్పాటుచేయకుండా, బీసీ రిజర్వేషన్లను మొత్తంగా రద్దు చేసి, వాటన్నింటినీ జనరల్ స్థానాలుగా మార్చింది. అయితే, అక్కడి ఒడిశా ప్రభుత్వం బీసీలకు పార్టీ పరంగా 50% టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్ సర్కారు సైతం అదే ఎత్తుగడను అమలుచేసేందుకు సిద్ధమవుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ముందునుంచీ చెప్తూ వస్తున్నది. ప్రామాణికమైన డాటా లేకుండా, డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు చెల్లబోమని, ఈ నేపథ్యంలో ఒడిశా తరహాలోనే పార్టీ పరంగా టికెట్లు కేటాయించి, తద్వారా 42% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నదని ఆదినుంచీ చెప్తున్నది. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వస్తుండటం గమనార్హం.