బీసీ సంక్షేమమంత్రి గంగుల
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడే వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. అలా ఏర్పడకపోతే ఈ నెల 15 తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులపై హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 18 కులాల సంఘాలు ఏకసంఘంగా ఏర్పడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం 82 ఎకరాలు, రూ.92 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా త్వరలోనే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కమిషన్ సభ్యుడు కిషోర్‌గౌడ్, అధికారులు పాల్గొన్నారు.