42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఊదరగొట్టి, చివరకు 17శాతానికే పరిమితం చేసిన కాంగ్రెస్ సర్కారుపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కులగణన నుంచే వ్యూహాత్మక కుట్ర చేసి బీసీల జనాభాను తక్కువ చూపిందని ధ్వజమెత్తుతున్నాయి. ఆ లెక్కల ఆధారంగానే నేడు రిజర్వేషన్లు ఖరారు చేసి కోటాకు కోత పెట్టిందని భగ్గుమంటున్నాయి. కులాలవారీగా లెక్కలు, నివేదికలను ప్రభుత్వం బయటకపెట్టకపోవడం కూడా బీసీ సంఘాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అమలు చేస్తాం’ అని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించింది. రూ.160 కోట్లతో నిరుడు నవంబర్లో ఇంటింటి సర్వే(సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, కుల) నిర్వహించింది.
రాష్ట్రంలో మొత్తంగా 3.70కోట్ల మంది జనాభా ఉండగా, అందులో 3,54,77,554(96.9శాతం) మందిని సర్వే చేసింది. 16లక్షల జనాభా(3.1శాతం) వివరాలు సేకరించలేదు. ఇక అందులో బీసీలు 46.25శాతం, బీసీ ముస్లింలు 10.08శాతం, ఎస్సీలు 17.43శాతం, ఎస్టీలు 10.45శాతం, ఓసీ ముస్లింలు 2.48శాతం, ఇతర ఓసీలు 13.31శాతం ఉన్నారని తేల్చింది. ఇంటింటి సర్వే ప్రకారం దశాబ్దకాలంలో (2014 సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే) తెలంగాణ జనాభా వృద్ధి రేటు మొత్తంగా 2లక్షలు (0.54శాతం) మాత్రమే. ఈ డేటాపై రాష్ట్రవ్యాప్తంగా ఆనాడే సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. వార్షిక జనాభా వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర జనాభా 4.18కోట్ల మందికి పైగా ఉంటుందనేది అంచనా. 2014 గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కలతో పోల్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు పూర్తిగా అసంబద్ధంగానే ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.
2001-2011 జనాభా వృద్ధి రేటు అనుసరించి రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35శాతంగా నిర్ధారించగా, 2011-2024లో అంటే గడిచిన 13ఏళ్లలో జనాభా దాదాపు 70లక్షలకు పైగా పెరగాలి. కానీ కాంగ్రెస్ సర్కారు వెల్లడించిన గణాంకాల ప్రకారం 2011-2024 మధ్య కాలంలో 20,73,880 (5.07 శాతం) మంది మాత్రమే పెరిగారు. దాదాపు 50లక్షల భారీ వ్యత్యాసం ఉండడంతో సర్వే గణాంకాలు పూర్తిగా అసంబద్ధమని ఆనాడే విషయ నిపుణులు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు గగ్గోలు పెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 15.45శాతం కాగా, 2014 ఎస్కేఎస్ సర్వే ప్రకారం 18శాతం. అయితే కాంగ్రెస్ నిర్వహించిన ఇంటింటి సర్వే మాత్రం రాష్ట్ర ఎస్సీ జనాభా కేవలం 17.43శాతమనే నిర్ధారించింది. ఎస్సీ జనాభా దశాబ్దాకాలంలో పెరగడానికి బదులు తగ్గడం గమనార్హం. రాష్ట్ర జనాభాలో మొత్తంగా బీసీలు 46.25శాతమని, బీసీ ముస్లింలు 10.08శాతమని, మొత్తం బీసీ జనాభా 56.33శాతంగా ప్రభుత్వం లెక్కతేల్చింది. కానీ రాష్ట్రంలో బీసీ ముస్లింలు కాకుండానే బీసీల జనాభా 51శాతానికి పైగా ఉంటుందని బీసీ సంఘాలు, సామాజికవేత్తలు నొక్కి చెబుతున్నారు. కులాలవారీగా లెక్కలను వెల్లడించకపోవడమే ప్రభుత్వ కుట్రకు నిదర్శనమని వివరిస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఇంటింటి సర్వే పేరిట కుట్ర పూరితంగానే ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చూపిందని, ఆ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయించి రిజర్వేషన్ల కోటాను కుదించిందని బీసీ సంఘాలు, సామాజికవేత్తలు మండిపడుతున్నారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆమేరకే బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున సీట్లు రిజర్వ్ చేశారు. కానీ ప్రస్తుతం 2024 లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల బీసీ రిజర్వేషన్ల కోటా 17.08 శాతానికి కుదించిందని వివరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా బీసీ జనాభా పెరిగితే రిజర్వేషన్ స్థానాలు కూడా పెరగాలని, కానీ అందుకు విరుద్ధంగా బీసీల సీట్లు కోతపడటం గమనార్హం. మొత్తం 31 జిల్లాల్లో దాదాపు 7జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లు 10శాతం కూడా దాటకపోవడం, కొన్ని మండలాల్లో ఒక్కటీ దక్కకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఓసీలకు గతం కంటే ఈసారి సర్పంచ్ స్థానాలు పెరగడం కొసమెరుపు.