Bathukamma | హైదరాబాద్ : బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బతుకమ్మ సీడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను కేసీఆర్ గొప్పగా నిర్వహించారు. ఈసారి మూడు బతుకమ్మ పాటలు ప్రత్యేకంగా రాయించాం అని ఆమె తెలిపారు.
అనంతరం కోవా లక్ష్మీ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు కానుక ఇచ్చారు. ఆదివాసులు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు అని తెలిపారు.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. లంబాడీలు తీజ్ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడు లంబాడీలు కూడా బతుకమ్మ ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ కోసం లంబాడీ ఆడబిడ్డలు ఎదురుచూస్తుంటారు అని కవిత పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేద, గొప్ప, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ, బోనాలు కూడా తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకునే అవకాశం కేసీఆర్ ఇచ్చారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు.
చివరగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుంది. బతుకమ్మ పాటలు రాసినవాళ్లంతా సాధారణ మహిళలు. మన జీవితం ఎంత పొడవో.. మన పాటలు అంత పొడవు. తీజ్ పండుగ కూడా ప్రకృతిని పూజించే పండుగ. బతుకును పూజించే పండుగ బతుకమ్మ. బతుకమ్మలు పేర్చేవి తోట పువ్వులు కాదు.. బాట పువ్వులు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ. బతుకమ్మకు గుడి లేదు.. మంత్రాలు లేవు.. పూజారి లేడు. బతుకమ్మ పాటల్లో జీవితాలు, మానవ సంబంధాలు ఉన్నాయి. మానవతా విలువలను కాపాడేది మహిళలే అని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.