బంజారాహిల్స్, జూలై 3: మంత్రులు విసిరిన సవాల్‌ను స్వీకరించి గురువారం గన్‌పార్కు వద్ద చర్చ కోసం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన 25మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురుకులాల్లో జరుగుతున్న అవకతవకలపై చర్చకు సిద్ధమని ప్రకటించిన రాష్ట్రమంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాళ్లను స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు గురువారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పాటు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సమయంలో తెలంగాణ భవన్లో ఉన్న అనేకమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ భవన్‌నుంచి గన్‌పార్క్‌కు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు సుమోటోగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై కేసు నమోదు చేశారు.