కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 4 : పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అనేకమంది మాజీ సర్పంచులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. బిల్లుల కోసం ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.
మాజీ సర్పంచులు రోడ్డెకి బిచ్చగాళ్లుగా అడుకునే పరిస్థితిని కాంగ్రెస్ సర్కార్ కల్పించిందని మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు భారీగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.