Indiramma Indlu | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : ‘గరీబుల ఇండ్లకు ఇందిరమ్మ పేరు అడ్డంకిగా మారనున్నదా?’ అంటే.. బీజేపీ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనుబట్టి ‘అవును’ అనే అనిపిస్తున్నది. ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పేదల గృహనిర్మాణ పథకానికి ఇందిరమ్మ పేరు ఖరారు చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్లిన మరుసటిరోజే ఈ అంశం తెరపైకి రావడం పలు సందేహాలకు తావిస్తున్నది. రాష్ట్ర పర్యటన సందర్భంగా ఖట్టర్ ఇందిరమ్మ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారని, అందుకే బండి సంజయ్ దీనిపై మాట్లాడారనే ప్రచారం జరుగుతున్నది.
పీఎంఏవైకి అనుబంధంగానే..
దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కి అనుబంధంగానే వివిధ పేర్లతో గృహనిర్మాణ పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణలోనూ పీఎంఏవైకి అనుబంధంగానే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ పేరును ఖరారు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేండ్లపాటు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. కేంద్రంలో పదేండ్ల నుంచి ఎన్డీఏ సర్కారు కొనసాగుతున్నది. మరోవైపు దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు మూడు రాష్ర్టాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సహకారంతో తెలంగాణలో చేపట్టే గృహనిర్మాణ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌తోపాటు విపక్ష పార్టీలైన ఆప్, టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనూ గృహనిర్మాణ పథకాలకు నేతల పేర్లు పెట్టకపోవడం గమనార్హం
కేంద్రమంత్రి వెళ్లిన మరుసటిరోజే వివాదం
తాజాగా శుక్రవారం కేంద్రమంత్రి కట్టర్ రాష్ట్ర పర్యటనకు రాగా రాష్ర్టానికి 20 లక్షల గృహాలు మంజూరు చేయాలని సీఎం సహా రాష్ట్ర మంత్రులు ఆయనకు విజ్ఞప్తిచేశారు. శనివారం రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గృహనిర్మాణ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం నుంచి నిధులు ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇందిరమ్మ పేరు పెట్టడంపై కేంద్రమంత్రి ఖట్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినందునే బండి సంజయ్ ఇలా వ్యాఖ్యానించారనే ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఇదే నిజమైతే ఇందిరమ్మ పేరు మార్చనంతవరకు వివిధ కారణాలతో కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉండదని, ఒకవేళ నిధులు వచ్చినా అరకొరగానే వస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర నిధులతో పథకాన్ని అమలు చేస్తున్నందున ఇండ్లపై కేంద్ర ప్రభుత్వ చిహ్నం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర సర్కారు ఇదివరకే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం పెడితే వివాదం లేకుండా పథకం అమలయ్యే అవకాశమున్నది. అలాకాకుండా నాయకుల పేర్లో, లేక కాంగ్రెస్ రంగులో ఇండ్లకు వేస్తే ఇబ్బందులు తప్పవని రాజకీయవర్గాలు హెచ్చరిస్తున్నాయి.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సైతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతున్నది. ఈ మేరకు అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విధంగా లక్షలాదిమందికి ఇండ్లు వచ్చే అవకాశం లేదని సాక్షాత్తూ అధికారవర్గాలే చెప్తున్నాయి. మరోవైపు, ఏడాది గడిచినా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు నోచుకోకపోగా తాజాగా ఫిబ్రవరిలో అర్హుల జాబితా ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇందిరమ్మ పేరు ఉంటే కేంద్ర నిధులు ఇచ్చేదిలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించిన వెంటనే మంత్రి పొంగులేటి ప్రకటన రావడం విశేషం. దీన్నిబట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరు మార్పు తప్పదని, సొంతింటి కోసం పేదలు మరికొంత కాలం వేచిచూడక తప్పదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.
‘ఇందిరమ్మ’ పేరు పెడితే నిధులివ్వం ; రేషన్‌కార్డుపై మోదీ ఫొటో ఉండకపోతే రేషన్ ఇవ్వం: బండి
కరీంనగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని, కేంద్రం నుంచి నిధులు ఇచ్చేదే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇండ్లు మంజూరు చేస్తది.. వాటికి ఇందిరమ్మ అని పేరు పెడితే కేంద్రం నుంచి పైసా కూడా రాదు రాసి పెట్టుకోండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రేషన్‌కార్డుల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరమ్మ ఫొటో ఉండి ప్రధాని ఫొటో లేకుంటే రేషన్ ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. ‘గ్రీన్కో సంస్థపై ఏసీబీ దాడులు చేసి విచారణ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది.. నేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ చేస్తున్న.. గ్రీన్కో సంస్థ నుంచి కాంగ్రెస్‌కు పైసలు ముట్టినయా? లేదా? ముట్టలేదని ప్రమాణం చేస్తావా?’ అంటూ బండి సవాల్ విసిరారు. బీజేపీ సహా అన్ని పార్టీలూ డబ్బులు తీసుకుంటాయని, పార్టీలు నడపాలంటే వాళ్లు.. వీళ్లు సహకరిస్తేనే సాధ్యమని, అంతేకాని..జేబులనుంచి ఎవరూ డబ్బులు పెట్టలేరని చెప్పారు. గ్రీన్కో సంస్థ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నదని, తద్వారా తెలంగాణకు ఆదాయం వస్తున్నదని, ఇలాంటి సంస్థలపై దాడులు చేయడం వల్ల ఆ సంస్థలు తెలంగాణను విడిచిపెట్టి ఇతర రాష్ర్టాలకు వెళ్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.
వివిధ రాష్ర్టాల్లో గృహనిర్మాణ పథకాల పేర్లు ఇలా..