హైదరాబాద్, మే 10 (నమస్తేతెలంగాణ): కేంద్ర మంత్రి బండిసంజయ్ కొడుకు భగీరథ్ దుర్మార్గానికి బలైపోయిన బాలిక ఆర్తనాదాలు మోదీకి వినిపించలేదా అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళానేతలు సుమిత్రా ఆనంద్, మమతతో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధించారు. ‘తన క్యాబినెట్లోని మంత్రి కొడుకు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినా మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు’..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి నుంచి తప్పుకొని విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దోపిడీలు, హత్యలు, మానభంగాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు.
భగీరథ్ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరిచి బాధిత బాలికను ఇబ్బందులు పెట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
తోడు దొంగల పాలన: సుమిత్రానంద్
రాష్ట్రంలో బండి, రేవంత్రెడ్డి తోడు దొంగల పాలన నడుస్తున్నదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్ ధ్వజమెత్తారు. ఇద్దరు కుమ్మక్కై బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే బాధిత బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.