హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీకి మాయని మచ్చలా మిగిలిపోతుందని సొంత పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారట. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణపైనే దృష్టిసారిస్తామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర నేతలు ఈ అంశంతో ఒక్కసారిగా కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భగీరథ్‌పై పోక్సో కేసు తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకులు మీడియా కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కేసుపై ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందోనన్న భయంతో ముఖ్యనేతలం తా ముఖం చాటేస్తున్నారు. ఇతర పార్టీలకు సం బంధించి ఏ అంశంపైన అయినా వెంటనే సోష ల్ మీడియా వేదికగా స్పందించే కొంతమంది కీ లక నేతలు సైతం భగీరథ్ కేసు తర్వాత సైలెంట్ అయ్యారని చెప్తున్నారు. ఈ అంశంపై స్పందిస్తే ఇరుకున పడటం ఖాయమని వారు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అందుకే ఫోన్లు ఎత్తేందుకు సైతం రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జంకుతున్నట్టు తెలిసింది. జర్నలిస్టులు ఎవరైనా కాల్ చేసినా, పోక్సో కేసు గురించి మాట్లాడితే హఠాత్తుగా ఫోన్లు కట్ చేస్తున్నట్టు సమాచారం. ఓ వైపు ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న రాష్ట్ర బీజేపీకి భగీరథ్ కేసు భయం వెంటాడుతున్నదనే చర్చ నడుస్తున్నది. ముఖ్యనేతలంతా వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండటం.. వారిని ఎలా గాడిన పెట్టాలో తెలియక అధిష్ఠానం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్న స మయంలో పోక్సో కేసుతో పార్టీని పాతాళానికి తొక్కినట్టు అయిందనే చర్చ నడుస్తున్నది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇటీవల స్పందిస్తూ.. కొడుకు కేసుతో సంజయ్‌కు ఏం సంబంధం? అని మీడియాను ఎదురు ప్రశ్నించడంపై సైతం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తా యి. బా ధ్యతారాహిత్యంగా చేసిన ఈ వ్యాఖ్యల పై జా తీయ మీడియా సైతం విస్మయం వ్యక్తంచేసింది.
బీజేపీ నేతలకు సామాన్య ప్రజలు ఫోన్లు చేసి ఈ అంశంలో ఎందుకు స్పందించడం లేదని కడిగి పాడేస్తున్నారట. ఈ మేరకు ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఓ సామాన్య మహిళ ఫోన్ చేసి పోక్సో కేసుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సైతం ఇలాగే ఫోన్ రాగా ఆయన కట్ చేశారట. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు ఓ మహిళా సంఘం నేత ఫోన్ చేయగా ఆమె ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారని తెలిసింది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం టీవీ డిబేట్లకు వెళ్లే బీజేపీ నాయకులు సైతం ఈ ఘటన తర్వాత ముఖం చాటేశారు. బీజేపీ శ్రేణులు బాలికపైనే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం విమర్శలకు తావిస్తున్నది. బాలిక ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తూ ఆమెనే మానసికంగా వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్ ఈ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారని బీజేపీ నేతలంతా గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. పోక్సో కేసు దెబ్బతో రాష్ట్రంలోని బీజేపీ నేతల ఇమేజ్ డ్యామేజ్ అయిందనే చర్చ నడుస్తున్నది. మోదీ బహిరంగ సభ తర్వాత పార్టీలో జోష్ ఉంటుందని భావించిన నేతలకు బండి కొడుకు అంశం కొరకరాని కొయ్యగా మారింది. మోదీ సభ కంటే ఎక్కువగా భగీరథ్ పోక్సో కేసుపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. రాష్ట్రంలో మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండటంతో బీజేపీ నేతలు గల్లీల్లో తిరగలేని పరిస్థితి నెలకొన్నది. గతంలో సైతం బండి భగీరథ్ విద్యార్థులను కొట్టిన వీడియోలు వైరల్ కాగా, తాజాగా మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ నేత, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకు ప్రవర్తనతో పార్టీ పరువు మంట గలుస్తున్నదని బీజేపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు తెలిసింది.
ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నది. పోక్సో లాంటి తీవ్రమైన కేసులో వెంటనే చర్యలు తీసుకొని నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉండగా, జాప్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు పరారీలో ఉంటే కనీసం ఇప్పటివరకు అతని జాడ కనిపెట్టకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదు అంది ఐదు రోజులు కావస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అయినా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తీరు బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నదంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ మహిళా నేతలు సైతం ఈ అంశంపై మాట్లాడకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది. మొత్తానికి భగీరథ్ పోక్సో కేసు తమ చావుకొచ్చిదంటూ బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారట.