భివాని (హర్యానా): కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన భారత బాక్సర్ సాక్షి చౌదరి తన సక్సెస్ వెనుక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహీ పాత్ర ఉందని తెలిపింది. తన కెరీర్ కష్టకాలంలో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఎంతో మద్దతుగా నిలిచిందని, కోహ్లీయే తన స్పాన్సర్‌గా వ్యవహరించాడని మహిళల 51 కేజీల విభాగంలో పసిడి పతకం గెలిచిన సాక్షి చెప్పింది. ‘నేను దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ స్ఫూర్తితో బాక్సింగ్ ప్రారంభించినప్పటికీ, నా ప్రయాణంలో విరాట్ కోహ్లీ నాకెంతో మద్దతుగా నిలిచారు. ఆయనే నా స్పాన్సర్‌గా ఉంటూ నన్ను ప్రోత్సహించారు. ఆర్థిక సాయంతో పాటు మానసికంగానూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అని పేర్కొంది. పోటీకి ముందు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా కేవలం రింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టాలని కోహ్లీ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడిందని సాక్షి వెల్లడించింది.