కరీంనగర్: మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ ఆగదని, మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందేనని, లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవన్నారు. నక్సల్ హింసలో ఎందరో నాయకులు, పోలీసులు, అమాయక గిరిజనులు చనిపోయారన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టనపెట్టుకున్న వాళ్లతో చర్చలు ఉండవన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చిచంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. అందువల్ల తుపాకీ వీడనంత వరకు వారితో చర్చల ఊసే ఉండదని స్పష్టం చేశారు.
పాస్పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామన్నారు. పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, వారు కేంద్రంతో సహకరించాలన్నారు. రోహింగ్యాలపై కాంగ్రెస్ తన వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు. దానిని కాంగ్రెస్ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదని వెల్లడించారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆ పార్టీ డ్రామాలడుతున్నదని విమర్శించారు.