హైదరాబాద్, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతల పేరిట కాంగ్రెస్ సర్కారు తల గోక్కుంటున్నదని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, సర్పంచుల పెండింగ్ బిల్లులే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కొంపముంచనున్నాయని చెప్పారు. హైదరాబాద్బండ్లగూడలో మీడియాతో మాట్లాడారు.
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ నిరుపేద హిందువుల ఇండ్లను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. మలక్పేట రేస్కోర్సు నుంచి మూసారంబాగ్ వరకు అసదుద్దీన్ ఒవైసీ అనుచరులు కబ్జాలు చేశారని, దమ్ముం టే వాటిని టచ్ చేయాలని సవాల్ విసిరారు. పేదల ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని, హైడ్రా, మూసీ బాధితుల ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినపడటం లేదా? అని ప్రశ్నించారు. జియాగూడలో దళితులు, చాదర్ఘాట్లో హిందువుల ఇండ్లను నేలమట్టం చేసిన ప్రభుత్వం, ఒవైసీ అనుచరులు అక్రమంగా కట్టుకున్న ఇండ్లను మాత్రం వదిలేస్తున్నదని ఆరోపించారు.