Bandi Sanjay | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బిడ్డలంటే బీజేపీ నేతలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలోని యువత అంటే కేవలం ఓటర్లు మాత్రమే అని, నాలుగైదు మాటలు చెప్పి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ సిద్ధాంతమని మరోసారి తేలిపోయింది. రాష్ట్రంలోని యువత ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని, మంచిగా చదువుకొని ఉన్నతస్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ సర్కారు వరుసగా ఉద్యోగ నోటిఫికేన్లు విడుదల చేసింది. కానీ.. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ..‘మీ చదువులు పక్కన పెట్టండి. 8 నెలలు నా వెనుక తిరగండి’ అని యువతకు పిలుపునిచ్చారు. దీనిపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
‘బండీ.. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరైనా పిల్లలను బుద్ధిగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలని చెప్తారని, కానీ.. నువ్వు వాళ్ల జీవితాలను నాశనం చేద్దామని చూస్తున్నావా?’ అంటూ సంజయ్‌పై మండిపడుతున్నారు. బండి మాటలతో బీజేపీ కుట్ర బుద్ధి బయటపడిందని, విద్వేషపు మంటల్లో అభం శుభం తెలియని యువతను సమిధలుగా మార్చాలన్నదే ఆ పార్టీ సిద్ధాంతమని తేలిపోయిందని మేధావులు పేర్కొంటున్నారు.
గతంలోనూ వరుసగా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ‘మా పార్టీకి కార్యకర్తలు ఉండొద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నది’ అంటూ బండి వ్యాఖ్యానించారని గుర్తు చేస్తున్నారు. యువత అంటే తమకు కార్యకర్తలు మాత్రమే, వాళ్ల జీవితాలు బాగుపడితే బీజేపీకి పుట్టగతులు ఉండవు.. కాబట్టి వారు అజ్ఞానంలోనే ఉండాలి.. అనేది బీజేపీ సిద్ధాంతమని అప్పుడే తేటతెల్లం అయ్యిందని అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, సీఎం కేసీఆర్ చెప్పినట్టు బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు.