కృష్ణ కాలనీ, జనవరి 28 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ర్టాన్నే దోచేస్తారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాశ్ అన్నారు. బుధవారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మంత్రులు పక్షం రోజులుగా నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారని తెలిపారు. ఓ మంత్రి కోల్ దందాలో భాగస్వాముడయ్యాడని, సీఎం రేవంత్రెడ్డి బామ్మర్దికి కాంట్రాక్టులు అప్పజెప్పుతున్నాడని వాళ్లకు వాళ్లే తిట్టుకుంటూ, ఒకరు చేసిన అక్రమాలను మరొకరు బయటపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వానికి ఓట్లేస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విమర్శించారు. తాజాగా నలుగురు మంత్రులు నైని బ్లాక్ కుంభకోణంపై రహస్యంగా సమావేశమై ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడుతున్నారని మిగతా మంత్రులు దుమ్మెత్తి పోస్తుంటే, ఆ నలుగురు మంత్రులు మున్సిపల్ ఎన్నికల కోసం సమావేశమయ్యామని బయటికి ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. జిల్లా రద్దయితే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా తరిమివేయాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని భయపడి, జీవో, కాపీలు లేని నిధులతో వారం రోజులుగా మంత్రులంతా భూపాలపల్లికి వరుసకట్టి ఊరంతా వందకుపైగా శిలాఫలకాలు వేశారని, దమ్ముంటే ఆ శిలాఫలకాల నిధుల జీవో కాపీలను పట్టణ ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.