హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా విక్రయాలపై నిషేధం మొదలైందని విమర్శించారు. యూరియా విక్రయాలు నిలిపివేస్తూ మౌఖిక ఆదేశాలివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా విక్రయాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని ఆయన నిలదీశారు.
స్టాక్ ఉన్నా.. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో యూరియా ఎందుకివ్వడం లేదని, యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని హరీశ్‌రావు ప్రశ్నించారు. యూరియా విక్రయాలు నిలిపివేయడం వల్ల చెరుకు, పండ్ల తోటలు, కూరగాయల రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి, ఎరువుల కష్టాలను మరింత పెంచేలా రూపొందించిన యాప్.. రైతుల పాలిట శాపంగా మారిందని నిప్పులు చెరిగారు.
ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉకిరిబికిరి చేస్తున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై దృష్టిసారించడం మానేసి, వినియోగం తగ్గించాలని రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల.. ఓవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమేనని మండిపడ్డారు.
రైతుభరోసా ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమల్లో ఫెయిల్, రుణమాఫీ అమల్లో ఫెయిల్, యూరియా సరఫరాలో ఫెయిల్, పంట కొనుగోళ్లు, కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్.. ఇలా అన్నింటా ఫెయిల్ అయ్యారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు సీఎం రేవంత్‌రెడ్డికి తగులకుండా పోదని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. రైతులు నిలదీయడంతో అధికారులు భయపడి రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం, తమరి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా నిరంతరం యూరియా విక్రయాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్‌ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.