రామకృష్ణాపూర్, మార్చి 22: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఈ నెల 24 లోగా ఎన్నిక నిర్వహించకపోతే హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ విప్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన అక్రమకేసులో అరెస్ట్ అయి జిల్లా న్యాయస్థానం తీర్పు మేరకు ఆదిలాబాద్ జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన బాల్క సుమన్ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మూడోసారి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్ తనతోపాటు బీఆర్ఎస్ నాయకులు 25మందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని చెప్పారు. ఈనెల 24లోపు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు సూచించిందని, ఆలోగా ఎన్నిక జరుపకపోతే ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు.