హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. బురదలో పొర్లే పందికి పన్నీరు వాసన తెలియనట్లు బండి సంజయ్ తీరు ఉందని, ప్రగతి భవన్ విలువ ఆయనకు తెలియదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ బీజేపీ నేతలపై కదంతొక్కారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి, తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని సుమన్ అన్నారు.
రాష్ట్రంలోని 4 కోట్లమంది ప్రజలు అందరూ కేసీఆర్ అభిమానులేనని, ఉద్యమనాయకుడే రాష్ట్ర పాలకుడై అద్భుతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. సంక్షేమంలో దేశానికే సీఎం కేసీఆర్ పాలన ఆదర్శమని చెప్పిన బాల్క సుమన్.. రాష్ట్ర ప్రజలను బికారులన్న బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రాసిన లేఖలో విషయం అసలు లేదని, అంతా విషమేనని విమర్శించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రజలంతా కలిసి నిమజ్జనం చేస్తారని జోస్యం చెప్పారు.
ఐటీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేంద్ర సంఘమే ప్రశంసించిన విషయాన్ని బాల్క సుమన్ గుర్తుచేశారు. ఫార్మా రంగంలో కూడా దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలియజేశారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణే మెరుగ్గా ఉందని చెప్పారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. మోదీ సర్కారు రూ.119 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ నిప్పులు చెరిగారు. 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సర్కారు అమ్మకానికి పెట్టిందని విమర్శించారు.
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ ‘హరేక్ మాల్’ అంటూ అమ్మేస్తోందని మోదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అంతేకాకుండా దేశంలో అత్యధిక నేరాలు జరిగే రాష్ట్రంగా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ ఉందని విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత బండి సంజయ్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పసుపు రైతులను బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేసింది బీజేపీనే అని, వారికేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.