సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 18: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమంలో భాగంగా 16 రోజుల పాటు చెన్నూర్ నియోజకవర్గంలో ఊరూరా తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని 45 వేల ఫిర్యాదులు స్వీకరించారు.
గురువారం కార్యక్రమం ముగియగా, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులతో రామకృష్ణాపూర్‌లోని తన నివాసం నుంచి బాల్క సుమన్ భారీ కాన్వాయ్‌తో నస్పూర్‌లోని కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సూపరింటెండెంట్ రాజేశ్వర్‌కు ఫిర్యాదులు అందజేసి, ప్రజల సమస్యలు, హామీలను వెంటనే నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు రూ.2500 భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, రూ.15వేల రైతు భరోసా, రూ.4వేల నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం చెల్లిస్తామని హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. గడ్డం వివేక్ ఎన్నికల సందర్భంగా చెన్నూర్‌కు పరిశ్రమలు తీసుకువస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే దాకా ప్రభుత్వంపై పోరాటం ఆపేదిలేదని స్పష్టంచేశారు.