డిచ్పల్లి, ఆగస్టు 4: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి పనికి కమీషన్ల దందా నడిపిస్తూ, ఉల్టా బీఆర్ఎస్ హయాంలో జరిగిన వాటిపై విచారణ కమిషన్లు వేస్తున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకపోవడంతో జనం తిరుగబడతారనే భయంతోనే కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు భారీ భద్రత పెట్టుకున్నారని సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
నిజామాబాద్‌లో మీనాక్షి నటరాజన్ రెండ్రోజుల యాత్ర ప్రజల్లో హడావుడి సృష్టించేందుకు చేసిన కల్పిత కార్యక్రమమని చెప్పారు. అర్గుల్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్‌కు ఉప్పు పాతరేసింది నిజం కాదా ? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమాలోకి పోలేదా? 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కానీ విషయం వాస్తవం కాదా ? ఒక్క జిల్లాలోనే 2 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం పాదయాత్ర సందర్భంగా మీనాక్షి దృష్టికి రాలేదా ? రైతుభరోసా 15 వేలు ఇస్తామని మాట తప్పలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.