హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు కోసం జూన్ 3 నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూన్ 3 నుంచి 10 వరకు ఎన్రోల్మెంట్డ్రైవ్ను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు. జూన్ 13 నుంచి బడులు పునః ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా పండుగ వాతావరణంలో బడులను తెరిచి, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి భరోసా కల్పించాలన్నారు.
జూన్ 30 వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం బషీర్బాగ్లోని కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం బడులకు ఆహ్వానించి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం, ఆంగ్ల మాధ్యమంపై వివరించాలని సూచించారు. 14 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేకంగా రోజుకొక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు.
మన ఊరు -మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయని, ప్రైవేట్, క్వానెంట్ స్కూళ్లకు ధీటుగా బడులను తీర్చిదిద్దనున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరే అవకాశముందన్నారు.
ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, గతంలో సాధించిన ప్రగతిని విద్యార్థులకు వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి, పిల్లలంతా సర్కారు బడులకు వచ్చే విధంగా చూడాలన్నారు. కొత్తవారిని చేర్పించేందుకు స్వాగత ఏర్పాట్లు చేయాలని, మొత్తంగా బడుల్లో నూతన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. సర్పంచుల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందర్ని బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు.
పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక రోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చదివితే ఎలాంటి అవకాశాలుంటాయి? స్కాలర్షిప్లు లభిస్తాయా? అన్న అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వీడియో కాన్ఫరెన్స్లో
పాల్గొన్నారు.