హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. కాంగ్రెస్ సర్కార్ ఒంటెత్తు పోకడలతో కుట్రపూరిత వైఖరి బట్టబయలైంది. బీసీ మేధావులు, న్యాయకోవిదులు ఊహించినట్టుగానే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల అమలుకు అనేక న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని ‘నమస్తే తెలంగాణ’ ముందే హెచ్చరించింది. దీనిపై పలు కథనాలను ప్రచురించింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన క్రమంలో అందులోని విధానపర లోపాలను, న్యాయపరమైన అంశాలను ‘నమస్తే’ ఎలుగెత్తి చాటింది. సుప్రీంకోర్టు నిబంధనలకు పూర్తివిరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని, న్యాయపరమైన ఇబ్బందులు తప్పబోవని ముందే హెచ్చరించింది. ‘కుల సర్వే చట్టం ముందు నిలిచేనా?’, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందే అంటూ చాలా స్పష్టంగా తెలియజెప్పింది. అయినా సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. మరోవైపు రాష్ట్ర బీసీ కమిషన్ సైతం విచారణ అంటూ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. అభిప్రాయ సేకరణ చేపడుతూ హడావుడి చేస్తున్నది.
సంగారెడ్డి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మెదక్, సిద్దిపేట కలెక్టర్లపై బీసీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డిలో నిర్వహించిన బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వారు రాకపోవడంపై కమిషన్ చైర్మన్ నిరంజన్ మండిపడ్డారు. మెదక్, సిద్దిపేట కలెక్టర్లకు బీసీ కమిషన్ తరఫున నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు.