కంది, అక్టోబర్ 9: సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన నుంచి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చేరింది. సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కుటుంబ సభ్యులందరూ ఉండగానే క్షణంలో శిశువును ఎత్తుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు సంగారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్, డీఎస్పీ సత్తయ్య దవాఖాన దగ్గరికి చేరుకొని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని దుండగులను పట్టుకొని శిశువును అప్పగిస్తామని ధైర్యం చెప్పారు. సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గమనించారు. బురఖాలు ధరించి శిశువును దవాఖాన నుంచి బయటకు తీసుకెళ్లిన దశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ఎత్తుకెళ్లినవారు మైనార్టీ మహిళలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీస్ బృం దాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కూతురిపై మారు తండ్రి లైంగికదాడి ;నాలుగేండ్లుగా అఘాయిత్యం
వెంగళరావునగర్, అక్టోబర్ 9: వావి వరసలు మరిచి కామంతో కండ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడో మారుతండ్రి. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే మహిళకు ఖదీర్‌తో వివాహమై 2010 లో విడాకులయ్యాయి. పిల్లలను సోదరుడి వద్ద ఉంచి ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నది. ఆ మహిళకు సిరిసిల్లకు చెందిన లింగంపల్లి మహేందర్ పరిచయమయ్యాడు. ఇద్దరూ పెండ్లి చేసుకోగా, వీరికో కుమారుడు పుట్టాడు. 2019లో మొదటి భర్తతో కలిగిన కూతురిని (తొమ్మిదేండ్లు) తన ఇంటికి తీసుకొచ్చింది. ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండే మారు తండ్రి మహేందర్ ఆ బాలికపై నాలుగేండ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఇటీవల మహిళకు విషయం తెలిసి భర్తను గట్టిగా నిలదీయడంతో ఇద్దరిని చంపుతానని బెదిరించాడు. అంతేకాకుండా తనకు కుమార్తెను ఇచ్చి పెండ్లి చేయాలని మారుతండ్రి మహేందర్ వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.