హత్నూర, సెప్టెంబర్ 9: డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం దౌల్తాబా ద్, నర్సాపూర్ ప్రైవేట్ దవాఖానలకు తీసుకువెళ్లినా జ్వరం తీవ్రత తగ్గలేదు. నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలోని శిశురక్ష దవాఖానకు తీసుకువెళ్ల్లారు. అక్కడ వైద్యులు వైద్యపరీక్షలు జరిపి ప్లేట్లెట్స్ తగ్గడంతోపాటు డెంగ్యూ సోకినట్టు నిర్ధారించారు. అక్కడ అడ్మిట్ చేయించి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తీసుకువెళ్ల్లాలని సూచించారు. ఆదివారం నిలోఫర్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మంగపేట, సెప్టెంబర్ 9: ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం అంబేదర్ కాలనీకి చెందిన మహిళ సోమవారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంకాయల సుజాత (30)కు ఇరవై రోజుల క్రితం విషజ్వరం సోకగా, స్థానికంగా వైద్యం చేయించారు. నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందింది.