బాసర/మోర్తాడ్ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకాలో గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం అధికారులు తెరిచారు. కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులు 14 గేట్లను ఉదయం 11 గంటలకు తెరిచారు. ప్రస్తుతం 1064 అడుగుల వద్ద 15.880 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలకేనా ఇందిరమ్మ ఇండ్లు?
ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకేనా?, పేదలకు ఇవ్వరా.. అని జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వేణుగోపాలాచార్యులు, తహసీల్దార్ నాగేశ్వరాచారికి వినతిప్రతం అందజేశారు. ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని చెప్పి.. గతంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లు తీసుకున్న వారికి మంజూరు చేశారని ఆరోపించారు.
– పాలకుర్తి
టీయూ హాస్టల్ భోజనంలో పురుగులు
తెలంగాణ విశ్వవిద్యాలయం పీజీ న్యూబాయ్స్ హాస్టల్ భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి భోజనం వడ్డించగా పురుగులు ప్రత్యక్షమయ్యాయని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ యాదగిరి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
– డిచ్పల్లి
ఇల్లు ఇప్పించండి సారూ..
ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కాళ్లు మొక్కిన ఘటన నారాయణపేట జిల్లా సీఎం ఇలాకాలో చోటుచేసుకున్నది. మంగళవారం అధికారులు అభివృద్ధి పనులను పరిశీలించగా, అక్కడే ఉన్న బాలమణి తన ఇల్లు కూలిపోయే దశలో ఉన్నదని చెప్పింది. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
– కోస్గి