గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:22:28

ప్రైవేటుపరం.. బీజేపీ నైజం

ప్రైవేటుపరం.. బీజేపీ నైజం

  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌   
  • బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మెకు మద్దతు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే అనుమతివ్వాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 26న బీఎస్‌ఎల్‌ఎల్‌ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె ప్రచారంలో భాగంగా గురువారం బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచార్‌ భవన్‌ సర్కిల్‌ ఆఫీసు ఎదుట గేట్‌ మీటింగ్‌లో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని టీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ పోరాటానికి సిద్ధమయ్యారని, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి ఏ రాజమౌళి, ఎన్‌ఎఫ్‌టీఈ రాష్ట్ర కార్యదర్శి జూలపల్లి సంపత్‌రావు, బీఎస్‌ఎన్‌ఎల్‌ఈయూ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వండి 

ప్రశాంత హైదరాబాద్‌ కోసం గ్రేటర్‌ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ కోరారు. గురువారం ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘ నాయకులతో హైదరాబాద్‌లోని వారి కార్యాలయాల్లో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. బీజేపీ రిలయన్స్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ను నిర్వీర్యం చేస్తున్నదని, 60 వేలమంది ఉద్యోగులను తొలిగించే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలు, ఉద్యోగులు వీటిపై ఆలోచించాలని, టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపాలని కోరారు. ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.