B Vinod Kumar | అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి మన సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లిలో శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ వస్తే కరెంట్ లేక రాష్ట్రం చీకటి అవుతుందని, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారని, ఇప్పడు మారుమూల పల్లెలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి మా కరెంట్ తీగల మీద బట్టలు వేసి బతుకుతవా? దమ్ము ఉంటే రా? అంటూ సవాల్ విసిరారు.
70 ఎండ్ల పాలనలో రాష్ట్రంలోని గోదవరి నది మీద ఒక్క ప్రాజెక్ట్ కడితే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వతా 5 కొత్త ప్రాజెక్ట్‌లు కట్టి, గతంలో సముద్రంలో కలిసే జలాన్ని నేడు ఎత్తి పోసి రాష్ర్టాన్ని సస్యశ్యామల చేస్తున్నామని మనం గర్వంగా చెప్పుకోవాలే అన్నారు. మండుటెండల్లో వాగులు, చెరువులు జలకళతో పాడి, పంటలకు మత్స్య సంపదకు దోహదపడేవి విషయాన్ని విమర్శించే వారికి వివరించాలని చెప్పారు. 1982లో భూపాలపల్లికి వస్తే అన్నం దొరకలేదని, కాటారం పోయి తిన్నామని గుర్తు చేశారు. అలాంటి భూపాలపల్లి నేడు జిల్లాకేంద్రమైన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ కష్టాలను చూసి, పరిష్కార మార్గలను కూడా వెతికాడని ఫలితంగానే ఎవరూ అడగకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపట్టి సత్ఫాలితాలు పొంది దేశంలో నెంబర్ వన్‌గా తెలంగాణ నిలిపాడన్నారు.
నేడు దేశంలో గట్టి ప్రతి పక్షం లేదని, కాబట్టే బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి దేశ అభివృద్ధిని విస్మరిస్తున్నదని, బలమైన ప్రతిపక్షం కోసమే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారన్నారు. అప్పుల గురించి విమర్శించే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకుముందు రాఘవపూర్‌లో బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, సర్పంచ్ ఆది రాం నర్సయ్య విగ్రహన్ని ఆవిష్కరించి నివాళులర్పించి.. రాంనర్సయ్య పరకాల, భూపాలపల్లి, చిట్యాల ప్రాంతంలో సమస్యల పై పోరాటం చేసిన తీరును వివరించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి అరికెల నర్సిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర నాయకులు వెంకట్రాములు, ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, సర్పంచులు నందికొండ శోభారాణి, నల్లబెల్లి రమ, పోలాల సరోత్తంరెడ్డి, ఆది రఘు పాల్గొన్నారు.