హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగంలో తెలంగాణ రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ 2021-22 హ్యాండ్‌బుక్‌లో వెల్లడైంది. ఇందులో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. దేశంలోనే అతి పిన్న వయస్సున్న తెలంగాణ విద్యుత్తు విషయంలో పెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టింది. తెలంగాణలో అందుబాటులో ఉన్న తలసరి విద్యుత్తు పెద్ద రాష్ర్టాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. జాతీయ సగటు కంటే కూడా ఎక్కువగా ఉండటం ముదావహం. రాష్ట్రం ఏర్పడే నాటికి (2014-15) తెలంగాణలో తలసరి విద్యుత్తు 1151.8 కిలోవాట్ అవర్ అందుబాటులో ఉండగా.. 2021-22 నాటికి అది 2004.9 కిలోవాట్ అవర్‌కు పెరిగింది. జాతీయ సగటు మాత్రం 1115.3 కిలోవాట్ అవర్ వద్దే ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో (1378.6), ఢిల్లీ (1857.8), కర్ణాటక (1184.6), మధ్యప్రదేశ్ (1184.9), మహారాష్ట్ర (1537.8), రాజస్థాన్ (1301.7), తమిళనాడు (1520.6), ఉత్తరప్రదేశ్ (642.8), పశ్చిమ బెంగాల్ (599.7) తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నాయి.
రాష్ట్రంలో విద్యుత్తు సదుపాయం విషయంలోనూ తెలంగాణ చాలా రాష్ర్టాల కంటే ముందు వరుసలో ఉన్నది. 2014-15లో 4,064 కోట్ల యూనిట్ల విద్యుత్తు అందుబాటులో ఉండగా.. 2021-22 నాటికి 7,052 కోట్ల యూనిట్లకు పెరిగింది. దాదాపు 75 శాతం విద్యుత్తు సదుపాయం పెరిగింది. అదే ఏపీలో 2021-22 నాటికి కేవలం 6822 కోట్ల యూనిట్లు (2014-15తో పోల్చితే దాదాపు 30 శాతం లోపే పెరిగింది) మాత్రమే అందుబాటులో ఉంది. గుజరాత్లో కూడా 2014-15లో 9,621 కోట్ల యూనిట్లు ఉండగా.. 2021-22 నాటికి 12,367 కోట్ల యూనిట్లకు పెరిగింది. అంటే ఇక్కడ కూడా పెరుగుదల 29 శాతం మాత్రమే.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని తెలంగాణ ఏడేండ్లలో సుమారు 90 శాతం వరకు పెంచుకుంది. 2014-15లో 9470 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఉండగా.. 2021-22 నాటికి 18,069 మెగావాట్లకు చేరుకుంది.
దేశంలో పునరుత్పాదక ఇంధనం విషయంలోనూ తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌లో వెల్లడైంది. 2015లో కేవలం 91 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని గ్రిడ్‌తో అనుసంధానించగా.. 2021 నాటికి ఇదికాస్తా 4378 మెగావాట్లకు చేరుకున్నది.