ఆదిలాబాద్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) ః కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకొచ్చిన సరికొత్త నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతులకు అండగా నిలవాల్సిన సీసీఐ మద్దతు ధరతో పంటను సేకరించడంలో మెలికలు పెడుతూ నష్టాల పాలు చేస్తున్నది. ఈ ఏడాది నుంచి సీసీఐకి మద్దతు ధర క్వింటాలుకు రూ.8110తో పంటను విక్రయించాలంటే.. కపాస్ కిసా న్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని నిబంధన అ మలు చేస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్స్ లేక సిగ్నల్ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలో తేమ శాతం ఎనిమిది ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తున్న సీసీఐ 12 శాతం వరకు కొనుగోలు చేస్తూ ఒక్కో శాతానికి రూ.81 కోత విధిస్తున్నది. వర్షాలతో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పంటను తీసుకోవడానికి సీసీఐ అధికారులు తిరస్కరిస్తన్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.1200 తక్కువకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
ఎకరాకు ఏడు క్వింటాళ్లు మించితే ధ్రువీకరణ
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వారం రోజుల క్రితం సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. స్లాట్ బుకింగ్ విధానంలో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోలు చేస్తున్నది. రైతులు సోమవారం పంట విక్రయించడానికి స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. భారీ వాహనాల్లో పంటను తీసుకురాగా.. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే తీసుకునేలా సీసీఐ అధికారులు సాఫ్ట్వేర్ చేయడంతో రైతులు ఆందోళన చెం దారు. తాము ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున స్లాట్ బుకింగ్ చేసుకుంటే డు క్వింటాళ్లు ఎలా తీసుకుంటారని, కొనుగోళ్ల మధ్యలో మార్పులు చేయడం ఏంటని రైతులు సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులను నిలదీశారు. దీంతో దాదాపు రెండు గంటలపాటు కొనుగోళ్లు నిలిచిపోయాయి. చివరకు సీసీఐ అధికారులు పంట సేకరణకు అనుమతిచ్చారు. మంగళవారం నుంచి వ్యవసాయ శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రాలతో 12 క్వింటాళ్లు సేకరించనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
రైతులకు నష్టం కలిగిస్తున్న సీసీఐ
అధిక వర్షాలతో పత్తి దిగుబడులు సగానికి పడిపోయాయి. ఉన్న కొద్ది పంటను మద్దతు ధరతో సీసీఐకి అమ్ముదామంటే పూటకో నిబంధన విధిస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నారు. ఎకరాకు 12 క్వింటాళ్లు తీసుకుంటున్న సీసీఐ, ఇప్పుడు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసేలా ఆన్లైన్లో మార్పులు చేసింది. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్‌లో కూడా ఏడు క్వింటాళ్ల వరకు చూపెడుతున్నది. ఇప్పటికే తేమతో ఇబ్బందులు పడుతుంటే.. ఈ సరికొత్త నిబంధన కారణంగా ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించి నష్టపోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
– శార్థ నవీన్, రైతు, కజ్జర్ల (తలమడుగు)