హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసలే ఓవర్ లోడ్… అందులోనూ ఓవర్ స్పీడ్.. గుంతలతో నిండిపోయిన ఇరుకైన రోడ్డు.. టిప్పర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్. మరోవైపు 50 మంది కూర్చోగలిగే ఆర్టీసీ బస్సులో 70 మంది ప్రమాదకర ప్రయాణం. వెరసి చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగి… 19 మంది మృతి చెందారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి.. అందుకు తగినట్టుగా ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులు పెంచకపోవడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
ఎంతసేపు ఎదురుచూసినా బస్సు లు రాకపోవడంతో వచ్చిన బస్సులో నిల్చునే చోటున్నా సరే.. ప్రజలు ప్రయా ణం చేస్తున్నారు. ఓవర్‌లోడ్ అయిన బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పరిమితికి మించిన లోడ్‌తో సాగించే ప్రయాణాలతో ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నది. సర్కారు వైఫల్యం, ప్రైవేటు నిర్లక్ష్యంతో మీర్జాగూడలో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓవర్‌లోడ్‌ను నియంత్రించడంలో.. ఆర్టీఏలోని అవినీతి అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చేవెళ్ల ఘోర ప్రమాదానికి టిప్పర్, ఆర్టీసీ బస్సు ఓవర్‌లోడ్‌తో ప్రయాణించడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించడంలో రవాణాశాఖ ఫూర్తిగా విఫలమైందనే చర్చ జరుగుతున్నది. రవాణాశాఖ నిర్లక్ష్యం, అధికారుల అవినీతితో రోడ్లపై నెత్తుటేరులు పారుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. పటాన్చెరు ఇస్నాపూర్ నుంచి ఓవర్‌లోడ్‌తో బయలుదేరిన టిప్పర్‌ను మీర్జాగూడ వరకు ఆర్టీఏ అధికారులెవరూ అడ్డుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతున్నది. 35 టన్నుల సామర్థ్యం కలిగిన టిప్పర్.. 60 టన్నులకు పైగా కంకరను తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.