సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వాళ్లంతా రాష్ట్ర మంత్రులు.. బుగ్గ కార్లు.. చుట్టూ రక్షణగా పోలీసులు.. అదనంగా అనుచరుల బలం.. మరి ఇంతటి రాజకీయ బలవంతులు ఇప్పుడు సామాన్య ఓటరు ముందుకు పోవాలంటే జంకుతున్నారు. సాధారణంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగేందుకు రాజకీయ నాయకులు ఎంతకైనా తెగించడం చూశాం. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మాత్రం ఇలా అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. పాపం.. నోరెత్తి ఓటర్లను పలకరిద్దామంటేనే మంత్రులు నిలువునా వణికిపోతున్నారట. కనీసం మంచిగున్నరా? అని అడగాలన్నా బదులియ్యడం వదిలిపెట్టి ఆరు గ్యారెంటీలేమైనయ్! అంటూ ఎదురు ప్రశ్నిస్తరనే భయంతో ప్రచారంలో పలకరింపులే బంద్ పెట్టిండ్రు. మొదట్లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు ధైర్యం చేసి ఓటర్ల ముందుకు వెళ్లి ఇలా ఓటు అడిగారో! లేదో!! హైడ్రా కూల్చివేతలతో మొదలుపెడుతున్న తిట్ల పురాణం చివరకు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీసే వరకూ పోయింది.
ఈ మధ్యలో కాంగ్రెస్ రెండేండ్ల పాలనా వైఫల్యాలను గుక్క తిప్పుకోకుండా ఓటర్లు అప్పజెబుతుండటంతో ‘ప్రచారానికొచ్చి మాస్ ర్యాగింగ్‌కు గురవుతున్నమా?’ అని మంత్రులు ఆందోళన పడ్డారు. అందుకే వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లు మంత్రులు కొన్ని రోజులుగా జూబ్లీ ప్రచార తీరును మార్చుకున్నారు. బండి దిగాలి.. వీధుల్లోకి వెళ్లాలి.. చెయ్యెత్తి నవ్వుతూ అభివాదం చేయాలి.. తిరిగి బండెక్కాలి! ఇగ ఇంతే! అనుకొని మెరుపు తీగల్లా ప్రచారం ముగించుకొని పోతుండటంతో వీళ్ల కోసం గంటల తరబడి ఎదురుచూసిన స్థానిక నేతలు ఏమి చెయ్యాలో తెల్వక తలకాయలు పట్టుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలవిగాని హామీ లిచ్చి ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేసిన ‘హస్తం’ పార్టీ నేతల ప్రచారం జూబ్లీహిల్స్ ఎన్నికలో కక్కలేక… మింగలేక అన్నట్లుగా తయారైంది.
కాంగ్రెస్ కండువా కప్పుకొని దూసుకుపోయిన ఒకరిద్దరు మంత్రులకు ప్రజా క్షేత్రంలో తీవ్ర చేదు అనుభవం ఎదురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డ రైతుబజార్‌కు ప్రచారం కోసం వెళ్లిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఇతర కాంగ్రెస్ నేతలకు మహిళలు ఒకవిధంగా మాస్ ర్యాగింగ్ చేశారు. రైతులకు సరైన యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఓ మహిళ మంత్రుల మొహం మీదనే చెప్పడమే కాకుండా మరో మహిళ కనీసం మంత్రుల మొహం చూసేందుకు కూడా ఆసక్తి చూపకపోవడాన్ని మంత్రులు తీవ్ర అవమానంగా భావించారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి.
దీంతో పాటు ఇటీవల రహమత్‌నగర్‌లో ఓ ఇంటికి ప్రచారం కోసం వెళ్లిన మరో మంత్రి జూపల్లి కృష్ణారావును వృద్ధురాలు గుక్క తిప్పుకోకుండా కాంగ్రెస్ సర్కారు నిర్వాకాలను మొహం మీదనే వల్లించింది. హైడ్రా కూల్చివేతలు మొదలు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేద ప్రజలకు ఏమీ చేయలేదని కుండబద్దలు కొట్టడంతో తెల్లమొహం వేసి పలాయనం చిత్తగించడం జూపల్లి వంతైంది. ఇవి బయటికొచ్చిన వీడియోలు మాత్రమే… కానీ ఏ మంత్రయినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు ఇంటింటి ప్రచారానికి వెళ్లినా ఇదే చేదు అనుభవం ఎదురవుతుంది.
అడుగడుగునా నిలదీతలు…
కాంగ్రెస్ మంత్రులు, నేతలను జూబ్లీహిల్స్ ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్లినా అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఏం చేశారని ఓట్లడగటానికి వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఓట్లడిగి అవతల పడతారు మళ్లీ కంటికి కనపించరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నారు. రెండేండ్లలో పేదలకు ఏం చేశారని? ఓట్లడగటానికి వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పదేండ్లలో ఎన్నడూ కరెంటు కోతలు లేవని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోజుకు మూడు నాలుగు సార్లు కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఇండ్లు కూల్చడానికి, మోరీలు నింపడానికే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల్లో తిరగడానికి వెనకడుగేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వస్తుండటంతో ప్రచారం చేసేందుకు జంకుతున్నారు. అసలే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అధిష్ఠానం పేర్లు పెట్టింది. దీంతో ప్రచారానికి వెళ్లకపోతే అధిష్ఠానం నుంచి అక్షింతలు.. ప్రచారానికి పోయి ఓటర్లను కలిస్తే ఇలా తెల్లమొహం వేసుకోవాల్సిన దుస్థితి. అందుకే ఏం చేయాల్నో తెలువక ఆందోళన చెందుతున్నారు.
ఓటరా… దూరం.. దూరం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు జంకుతున్న మంత్రులు ఇక అధిష్ఠానం ఒత్తిడి తట్టుకోలేక వినూత్న తరహాలో వింత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్ల దగ్గరికి పోతే చేదు అనుభవం ఎదురవుతున్నందున అసలు ఓటరును కలవకుండానే ప్రచారాన్ని ముగిస్తే బాగుంటుందని గుర్తించారు. అందుకే కొన్నిరోజులుగా ఏ మంత్రి కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో ఓటర్లను కలవడమే బంద్ పెట్టారు.
అధిష్ఠానం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలీసుల రక్షణలో బుగ్గ కారులో ప్రచారానికి పోతున్న మంత్రులు తమకు కేటాయించిన గల్లీకి పోతున్నారు. బండి దిగిన వెంటనే కొన్ని ఇండ్ల తలుపులకు స్టిక్కర్లు అంటిస్తున్నరు… వెంటనే రోడ్డు వెంట నడుచుకుంటూ రెండు వైపులా ఉన్న వారికి చేతులెత్తి అభివాదం చేస్తూ వేగంగా ముందుకుపోతున్నారు. కానీ కనీసం ఓటర్ల దగ్గర ఆగి నోరెత్తి… ఓటు వేయండి అని అడిగే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఏదో మంత్రులిస్తారు… ప్రచారం జోరు మీద చేయాలనుకున్న స్థానిక కాంగ్రెస్ లీడర్లు నైరాశ్యంలో కూరుకుపోయారు. మంత్రులొచ్చి కనీసం గంట కూడా ఉండకుండా ఉరుకులు పరుగులు పెడుతుండటంతో ఇదెక్కడి ప్రచారం నాయనా అంటూ నెత్తి నోరూ కొట్టుకుంటున్నారు.
జూపల్లికి చేదు అనుభవం… 
కాంగ్రెసోళ్లు చెయ్యి సూపిచ్చి ఓటెయ్యమంటరు. అటెంక నెత్తిన చెయ్యివెడ్తరు. ఓట్లేయించుకొని అవతల పడ్తరు. మళ్ల కంటికి కూడా కనపడరు. చేయి గుర్తొళ్లయినా.. పువ్వు గుర్తుళ్లొయినా మాకు చేసిందేమీ లేదు. ఓట్లప్పుడే కనవడ్తరు. ఈళ్లందరు ఎందుకొస్తున్నరు..? ఇండ్లు కూలుస్తందుకు వస్తుండ్రా..? కరెంటు పోగొడ్తందుకు వస్తున్నరా..? మోరీలు నింపేటందుకు వస్తున్నరా..? పదేండ్లు కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతుండ్రు.. మరి అంతముందు 60 ఏండ్లున్న కాంగ్రెసోళ్లు ఏం చేసిండ్రు..? ఇప్పుడు ఏం చేస్తుండ్రు? పింఛన్లు నాలుగు వేలకు పెంచుత అన్నరు పెంచిండ్రా.? ఆడబిడ్డలకు చీరెల్చిర్రా..? దినాం కరెంటు పోతున్నది. పదేండ్ల సంది కరెంటు పోయిందా? మీరొచ్చినంక ఎందుకు పోతున్నది? దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టుంది మీ పాలన’. అంటూ జూబ్లీహిల్స్‌లోని ఎర్రగడ్డకు చెందిన ఓ వృద్ధురాలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. చెయ్యి గుర్తుకు ఓటేయాలని ఆమెను కోరగా.. ఇప్పుడు చెయ్యి గుర్తుకు ఓటేయమంటరు.. ఆ తర్వాత నెత్తిమీద చెయ్యిపెడ్తరు. కంటికి కూడా కనపడరని మండిపడ్డారు. ఉచిత కరెంటు అన్నరు.. రూ.4వేల పింఛను అన్నరు ఎవరికిచ్చిండ్రు. రహమత్‌నగర్‌కు చెందిన వృద్ధురాలు మంత్రి జూపల్లి మొహం మీదనే చెప్పిన మాటలివి.