అన్నదాతలు కన్నెర్రజేశారు. తేమశాతం పేరిట కోత పెట్టడం, ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపినా దింపుకోకపోవడంపై భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం వేర్వేరు చోట్ల ఆందోళనలకు దిగారు. రైస్‌మిల్లుల యజమానుల తీరుపై ధ్వజమెత్తారు. తేమ శాతం పేరిట దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సర్కారు తీరు వల్లే తాము నష్టపోవాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. మరోచోట రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. తడిసిన ధాన్యంతోపాటు రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాట్రాపల్లిలో నిరసన
హుజూరాబాద్ రూరల్, నవంబర్ 3 : తడిసిన ధాన్యంతోపాటు రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హుజూరాబాద్ మండలం కాట్రాపల్లిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా రైతులను దగా చేస్తున్నదని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తారు. మొంథా తుపాను ఉందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు వరి రైతులందరికీ ఎకరానికి 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు తొగరు భిక్షపతి, నిరోషా-కిరణ్‌కుమార్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేటలో రాస్తారోకో
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 3: మిలర్ల దోపిడీపై వెంకటాపూర్ రైతులు ఆగ్రహించారు. ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపి ఐదు రోజులైనా దింపుకోకపోవడంతో కడుపు మండి రోడ్డెక్కారు. సోమవారం ఎల్లారెడ్డిపేట తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ధాన్యం లారీని అడ్డుగా పెట్టారు. గంటపాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్కారు తీరుపై భగ్గుమన్నారు. తమ గ్రామానికి చెందిన ధాన్యం దింపుకునేందుకు అధికారులు గొల్లపల్లిలోని రాజరాజేశ్వర ఇండస్ట్రీస్‌ను కేటాయించారని, కానీ, నిర్వాహకులు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ప్రతి లారీని వెనక్కిపంపిస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.
ఇదివరకు పంపిన నాలుగు లారీల్లో ఒక్కో లారీకి సగటున 8 క్వింటాల్ల ధాన్యం కోత పెట్టారని ఆరోపించారు. ఐదు రోజుల క్రితం ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపిస్తే తేమశాతం 22 వస్తున్నదని, 15 క్వింటాళ్ల తరుగు తీస్తామంటున్నారని మండిపడ్డారు. మరీ ఇంత దోపిడీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేమశాతం వచ్చిన ధ్యాన్యంలో బస్తాకు కిలో 300 గ్రాములు తీసుకుంటున్నారని, ఇప్పుడు మరో 15 క్వింటాళ్లు కోత పెడితే రైతులెట్లా బతికేదని ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తున్న మిల్లు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, లోడ్ చేసిన ధాన్యం దించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
డీఎస్వో చంద్రప్రకాశ్ అక్కడికి వెళ్లి రైతులను శాంతింపజేశారు. అదే లోడు లారీని గొల్లపల్లిలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌కు తరలించగా, అక్కడ మాయిశ్చర్ సగటున 18గా వచ్చింది. ఒక్క పాయింట్ తేడాతో అంత తరుగు పెట్టడమేంటని రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడుతూ, ఐదు రోజులుగా ధాన్యం దింపుకోకుండా అధికారుల ఆదేశాలను సైతం లెక్కజేయని రాజరాజేశ్వర ఇండస్ట్రీస్‌కు నోటీసులు పంపిస్తున్నామని, ఇప్పటి నుంచి ధాన్యాన్ని సదరు మిల్లుకు పంపవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర మిల్లుకు ధాన్యం తెచ్చిన హరిదాస్‌నగర్‌కు చెందిన రైతులు, డీఎస్వోను కలిసి తమ ధాన్యం తేమశాతం 17 వచ్చినా తీసుకోవడం లేదని మిల్లు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆవునూర్‌లో ఆగ్రహం
ముస్తాబాద్, నవంబర్ 3: కొనుగోలు కేంద్రంలో తూకం వేసి పంపిన ధాన్యాన్ని కోటా ముగిసిందంటూ మిల్లరు తీసుకోకపోవడంపై ఆవునూర్ రైతులు ఆగ్రహించారు. సోమవారం గ్రామంలో రాస్తారోకో చేశారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నామాపూర్ బాలాజీ రైస్ మిల్లుకు అధికారులు కేటాయించారని చెప్పారు. అయితే తేమశాతం వచ్చిన తర్వాత కాంటా వేసి మిల్లుకు పంపిస్తే దింపుకొనేందుకు మిల్లుల యజమానులు నిరాకరిస్తున్నారని, వాళ్లకు ఇచ్చిన 15వేల క్వింటాళ్ల టార్గెట్ నిండిందని చెబుతున్నారని వాపోయారు. సమాచారం మేరకు తహసీల్దార్ రామచంద్రం, ఐకేపీ ఏపీఎం కళ్యాణి స్పందించి, రైతుల పరిస్థితిని పై అధికారులకు వివరించారు. ధాన్యాన్ని మరో రైస్‌మిల్లుకు తరలించడంతో సమస్య సద్దుమనిగింది.
ఐదు రోజుల నుంచి తిప్పలు పెడుతున్రు
నేను 12 ఎకరాలు పొలమేసిన. వడ్లు 600 బస్తాలచ్చియనయ్. మాయిశ్చర్ తీసినంక జోకి బస్తాలు నింపినం. వానరాంగనే పర్దలు కప్పినం. బస్తాల అడుక్కు కొంచె పచ్చిగయితే ఆరబెట్టి నింపిచ్చినం. వడ్లు కాంటావెట్టి పంపి ఏడు రోజులైంది. వడ్లు మిల్లుకు పోయి ఐదు రోజులైతుంది. మిల్లరు దించుకోకుండా తిప్పలు పెడుతున్రు. తూకం తక్కువైతదని ముందగాలనే బస్తాకు 42 కిలోలు కాంటా పెట్టిచ్చినం. అయినా సాలదన్నట్లు ఇంకా కోత పెడుతమంటే ఇగ ఏంజెయ్యస్తది? ఇదివరకు నాలుగు లారీ వడ్లు ఆ మిల్లుకే పంపినప్పుడు వడ్లు వాపస్ పంపుతమంటే.. ఒక్కో లారికి ఏడెనిమిది క్వింటాళ్ల తరుగు తీసిన్రు. ఇప్పుడు ఈ లారీకి 15 క్వింటాల్లు తీస్తమంటే రైతు ఎట్ల బతుకుడు. మిల్లోల్లమీద చర్యలు తీసుకోవాలె.
– నోముల ఆదిరెడ్డి, రైతు (వెంకటాపూర్)
కాంటా ఎక్కువ పెట్టిచ్చినా దించుకోలేదు
నేను వెంకటాపూర్ సెంటర్ల సీఆర్పీగా పనిజేస్తున్న. గవుర్మెంటు నిబంధన ప్రకారం 40 కిలోల 700 గ్రాములు పెట్టాలె. రైతులు తిట్టినా సరే.. ఒకవేళ మిల్లుకాడికి పోయినంక దించుకునేటప్పుడు గట్లనే ఇబ్బంది పెడ్తరని 42 కిలోలు పెట్టిస్తున్నం. మేం 17 మాయిశ్చర్ రాంగనే నింపిపంపుతున్నం. ఇట్లనే మొన్న లారీ లోడ్ పంపితే మాయిశ్చర్ 22 వస్తుందని ఆపేసిర్రు. అక్కడికి పోయినంక 3 నుంచి 5 తేడా వస్తుంది. 18 వచ్చినా మిల్లోల్లు దించుకుంటరని అధికారులు చెప్పుతున్నా. అక్కడ దించుకుంటలేరు. మిల్లులల్ల వడ్లు ఆగిపోతే కల్లం వడ్లు అక్కడనే ఆగిపోతున్నయ్.
– పొన్నాల శ్రీధర్, సీఆర్పీ (వెంకటాపూర్)