గతంలో జరిగిన పొరపాట్లు గుణపాఠాలు కావాలి.. లేకపోతే అవి అంతులేని విషాదానికి దారితీస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కారణంగా సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది ఉసురు తీసింది.. హైదరాబాద్- బీజాపూర్ హైవేపై చేవెళ్ల సమీపంలోని రహదారి ప్రమాదకరంగా ఉన్నదని గత కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కానీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించపోవడం, న్యాయపరమైన చిక్కులను సమర్థవంతంగా పరిష్కరించుకోకపోవడంతో అది మృత్యుదారిగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే రోడ్డుపై కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లి ఐదుగురు మృత్యువాత పడిన విషయం విదితమే.. ఆ తర్వాత కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించలేదని పలువురు స్థానికులు, వాహనచోదకులు మండిపడుతున్నారు.
దాని పర్యవసానమే ఈ ప్రమాదమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రమాదస్థలికి వచ్చీరావడంతో బాధితులు ఎదురుతిరగడంతో నిమిషం సేపు కూడా ఉండలేక వెనుదిరిగిపోయాడు. గుంతలమయంగా ఉన్న రోడ్డుకు కనీస మరమ్మతులు చేయకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకుందని స్థానికులు ధర్నా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు రోడ్లు వేయడంతో ప్రమాదాలు జరగలేదని, కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పదుల సంఖ్యలో నిండుప్రాణాలు బలయ్యాయని కన్నీరు మున్నీరయ్యారు. సమాధానం చెప్పలేక తోకముడిచిన కాంగ్రెస్ నేతలకు.. కుప్పలుగా శవాలు.. గుండెలవిసేలా రోదనలు.. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయా.. అని స్థానికులు, బాధితులు ప్రశ్నిస్తున్నారు.

రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణపై అధికార కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి . ఈ రహదారిలోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల పొడవు గల ఈ రోడ్డు అనేక మూలమలుపులు తిరిగి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. ఈ రోడ్డుపై వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతున్నది. ఈ రోడ్డుపై ఉన్న మూలమలుపులను తొలగించి డబుల్‌గా ఉన్న రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించాలని వాహనచోదకులు, స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణకు రూ. 1,000 కోట్లను మంజూరు చేసి.. వెంటనే పనులను ప్రారంభించాలని ఉత్తర్వులూ జారీచేసింది.
అయితే, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దానికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లను తొలగించొద్దంటూ కొందరు కోర్టులో కేసులు వేయడంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డుపై ప్రమాదాలను నివారించేందుకు నాలుగులేన్లుగా మార్చాలని వాహనచోదకులు, స్థానికులు ఎప్పటి నుంచో..కోరుతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్త్తిక్రెడ్డి, మరో యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యం లో ఇటీవల చేవెళ్ల వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు.ఈ నేపథ్యంలో కోర్టు కేసులను వెంటనే పరిష్కరించి రోడ్డు విస్తరణ పనులను చేపడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ విస్తరణ పనులపై శ్రద్ధ చూపడంలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎంతోమంది క్షతగాత్రులవుతున్నారు.

వాహనాలు పెరుగుతున్నా.. విస్తరించని రహదారి
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రధానంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రహదారిలో ఇంజినీరింగ్, వైద్యకళాశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం తో కాలేజీలకు వచ్చి పోయే వాహనాలతో రద్దీ ఎక్కువైంది. దీంతోపాటు వికారాబాద్, పరిగి వంటి ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో రోజురోజుకూ వాహనాల తాకిడి పెరుగుతున్నది. డబుల్ రోడ్డు ఏమాత్రం సరిపోవడంలేదు. ప్రభుత్వం నాలుగులేన్ల ఏర్పాటుపై దృష్టి సారించకపోవడంతో సర్వత్రా ఆరోపణలొస్తున్నాయి. రోడ్డు విస్తరణ పనులు కాకుండా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని పలువురు రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన వారి బంధువుల ఆరోపిస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోని సర్కార్..
ప్రమాదం జరిగిన ప్రతిసారీ పదుల సంఖ్యలో ప్రాణా లు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఇటీవల ఈ రోడ్డుపై ఆలూ రి గేట్ సమీపంలో మోటర్‌సైకిల్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టడంతో వారు మృతి చెందారు. ఆ మరుసటి రోజే మరో లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న చిరు వ్యాపారులపై దూసుకెళ్లి ఐదుగురి మరణానికి కారణమైంది. అలాగే, ఈ రహదారిపై ప్రతిరోజూ ఏదో ఒక్క చోట రోడ్డు ప్రమాదం జరిగి పలువురు మరణించడమే కాకుండా అనేకమంది క్షతగాత్రులవుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్-బీజాపూర్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు శ్రద్ధ చూపడంలేదు. ముఖ్యంగా చిల్కూరు చౌరస్తాతోపాటు షాబాద్ చౌరస్తా, తోల్‌కట్టా, ఆలూరు, మ న్నెగూడ చౌరస్తా వద్ద అనేక మూల మలుపులున్నాయి. ఈ మలుపుల వద్దే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రహదారిపై ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదల తీవ్రత పెరిగేందుకు మరో కారణమని వాహనచోదకులు పేర్కొంటున్నారు.

నిధులున్నా ముందుకు సాగని పనులు..
బీజాపూర్ హైవేను నాలుగులేన్లుగా విస్తరిం చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లు కేటాయించి.. వెంటనే పనులను చేపట్టాలని ఉత్తర్వులను జారీ చేసింది. అధికారంలోకి వచ్చి దాదాపు 23 నెలలు దాటుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం రోడ్డు విస్తరణపై దృష్టి సారించకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు జరిగితే రోడ్డు పక్కన ఉన్న చెట్లు నరికివేస్తారన్న ఒకే ఒక్క కారణంతో కొం దరు పర్యావరణవేత్తలు వేసిన కేసులను ప్రభుత్వం త్వరగా పరిష్కరించక పోవడంతో.. ఆ రోడ్డు విస్తరణకు నోచుకోక సోమవారం జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
విస్తరణ జరిగి ఉంటే 19మంది మరణించేవారే కాదు..
రోడ్డు విస్తరణ పనులు జరిగి ఉంటే సోమవారం బస్సు ప్రమాదమే జరిగేది కాదని తాండూరుకు చెందిన ఏవీరెడ్డి అన్నారు. రోడ్డు విస్తరణ జరగకపోవడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు ప్రభుత్వ విప్, మహేందర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి ప్రమాదంలో 19 మంది మృతి చెందేందుకు వీరే బాధ్యత వహించాలన్నారు. నిధులున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం క్షమించరాని నేరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టాలన్నారు.