హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 ( నమస్తే తెలంగాణ ): తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ తీరు దున్నపోతు మీద వానపడ్టటే ఉన్నదని ఆటో జేఏసీ నాయకులు విమర్శించారు. జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నాలుగో రోజూ కొనసాగింది.
శనివారం తార్నాక, నాచారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో డ్రైవర్లు భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో నాయకులు మాట్లాడుతూ తమ ఉపాధిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకొట్టిందని తెలిపారు. ఉపాధిలేక డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న జరుగనున్న మహాధర్నాకు ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హబీబ్, శ్రీనివాస్, అస్లాం, రవి, కొమరయ్య, సాయిలు, చందు తదితరులు పాల్గొన్నారు.