హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం తమను మరోసారి మోసం చేసిందని ఆటోడ్రైవర్ల జేఏసీ మండిపడింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు హిమాయత్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో సమావేశమైన ఆటోడ్రైవర్ల జేఏసీ నేత లు మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్‌రెడ్డి సర్కార్‌లో చలనం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
డిసెంబర్ 7న తాము బంద్‌కు పిలుపుచ్చిన సమయంలో చర్చలు జరిపి, హామీలిచ్చిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమను మోసం చేశారని ఆటోడ్రైవర్ల జేఏసీ నాయకులు మండిపడ్డారు. తమకు మద్దతుగా ఖాకీ చొ క్కాలు ధరించి, ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వెళ్లి గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆటోడ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో జేఏసీ నేతలు వేముల మారయ్య, వెంకటేశం, వెంకటేశ్, ప్రవీణ్, సలీం పాల్గొన్నారు.