ఏడాదిలో పరిస్థితి తారుమారైంది. తెలంగాణ తెర్లమర్లయ్యింది. సమైక్య పాలనలో తెలంగాణపై ఏ పడగ నీడ పడిందో.. ఇప్పుడూ అదే జాడ. బీఆర్ఎస్ పాలనలో దేశానికే అన్నంగిన్నెగా మారిన తెలంగాణలో..ఇప్పుడు సాగు పడావు పడ్డది. అన్నదాత అంపశయ్యపై ఉన్నాడు. భరోసా లేక నేతన్నలు ఉరితాళ్లను పేనుకుంటున్నారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యల రూట్లో పోతున్నారు. ఆఖరికి మాజీ సర్పంచులూ బిల్లులు రాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
Telangana | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ఏడాదిలోనే ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు అప్పులపాలై, సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులుపదేండ్లపాటు నిబ్బరంగా నిలబడిన తెలంగాణ.. మళ్లీ చావులను కండ్ల చూస్తున్నది. దాదాపు దశాబ్దకాలంగా ఆగిన రైతు ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. ఊహించని ఉత్పాతంతో ఆటోడ్రైవర్ల జీవితాలు ఆగం కాగా, రైతుబంధు ఆగిపోయి పెట్టుబడి సాయం అందక అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వక చేనేతల జీవితాలు చతికిలపడ్డాయి. ఇలా అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వ బాధితుల మరణాలు నమోదువుతున్నాయి.
నేలరాలుతున్న విద్యా కుసుమాలు
తెలంగాణలో విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. ఏడాదిలో సుమారు 355 మంది విద్యార్థులు చనిపోయారు. వీరిలో గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న వారు ఉన్నారు. ఒత్తిడి వాతావరణం, ఆర్థిక ఇబ్బందులు, వేధింపులు వంటి కారణాలతో 325 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌తో ఐదుగురు, అనుమానాస్పద మృతులు 11 మంది ఉన్నారు. ఇంతజరిగినా ప్రభుత్వం తరఫున ఒక సమీక్షగానీ, భరోసాగానీ లేకపోవడం బాధాకరం అని విద్యార్థి సంఘాలనేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. అడిగేవారు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది నిర్లక్షం రాజ్యమేలుతున్నది.
347 మంది రైతుల ఆత్మహత్య
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 621 మంది అన్నదాతలు మరణించారు. ఇందులో 347 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ రాష్ట్రంలోని ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా లెక్కించినవే. రైతులకు ప్రభుత్వం ఇస్తానన్న ‘రైతు భరోసా’ ఇవ్వకపోగా, గతంలో ఠంచనుగా వచ్చిన రైతుబంధును కూడా ఆపేసింది. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, సగంలోనే ఆపేసింది. ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం కారణంగా అకాల వర్షాలతో అన్నదాతలు నిండా మునుగుతున్నారు. ఫలితంగా సన్న, చిన్నకారు రైతులు ధైర్యం కోల్పోతున్నారు. కాంగ్రెస్ పాలనలో 347 మంది రైతులు మరణించారంటే దాదాపు రోజుకు ఒక రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో పొలాలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అప్రకటిత కోతల నేపథ్యంలో రైతులు రాత్రిపూట కూడా పొలాలకు వెళ్లాల్సి వస్తున్నది. దీంతో కరెంట్‌షాక్ కొట్టి 232 మంది, పాము కాటుతో 17మంది రైతులు మృత్యువాత పడ్డారు.
ఆగిపోయిన సాంచాల సప్పుళ్లు
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్లు లేకపోవడంతో తెలంగాణలో నేతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. సాంచాల చప్పుళ్లు ఆగిపోయాయి. గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంల కోసం ఆర్డర్లు ఇచ్చేది. నేతన్నలు సంబురంగా పనిచేసుకునేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డర్లు ఆపేసింది. దీంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనుల్లేక ఇంటిల్లిపాది ఆకలితో అలమటించాల్సి వస్తున్నది. ఈ పరిణామాలతో ఏడాదిలో 28 మంది నేతన్నలు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఏడాదిలో 28 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బిల్లులు రాక.. బతకలేక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసింది.దీంతో అసలు వసూలుకాక, వడ్డీలు కట్టుకోలేక మాజీ సర్పంచ్‌లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గుండెపోట్లకు గురవుతూ తనువు చాలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురు మాజీ సర్పంచ్‌లు మరణించినట్టు చెప్తున్నారు.
బతుకు భారమై చావుకు దగ్గరై
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టడంతో జీవనోపాధికి కోల్పోయిన ఆటో డ్రైవర్లు తీవ్రమైన దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆటో తీస్తే డీజిల్ పోను రోజుకు 200 రూపాయలు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని విలపిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్న ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించింది. ఎలాంటి ఉపశమన ఏర్పాట్లు చేయకపోవడం, పూర్తిగా తమను విస్మరించడంతో.. గత్యంతరం లేక 89 మంది ఆటో డ్రైవర్లు ఉసురు తీసుకున్నారు. ఫిబ్రవరిలోనే 20మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు.