హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ)/మొయినాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలుకూరు బాలాజీ దేవాలయ పూర్వ ప్రధానార్చకుడు, మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ (90) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత ఐదేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సౌందరరాజన్.. రంగారెడ్డి జల్లా చిలుకూరులోని తన సొంత ఇంటిలోనే చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. బాలాజీ దేవాలయానికి సౌందరరాజన్ కుటుంబం ధర్మకర్త, అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నది. తరతరాలుగా ఆయన కుటుంబం బాలాజీ సేవలో తరిస్తున్నది. డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ తమిళనాడులో జన్మించారు. అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్న తరువాత ఇంటర్, బీకాం, ఎంకాం, ఎల్ఎల్బీ చేశారు. వివాహం అనంతరం హైదరాబాద్‌లోని నల్లకుంట డీడీనగర్లో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు కుమారులు లక్ష్మీనర్సింహ్మన్, రంగరాజన్, మురళీధరన్ ఉన్నారు. సౌందరరాజన్ అంతిమ దహన సంస్కారాలను శనివారం ఉదయం 9 గంటలకు చిలుకూరు బాలాజీ ఆలయం వెనుక భాగంలోని గోశాల పక్కన నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు, ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు సౌందరరాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు సౌందరరాజన్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, శ్రీమరియాదవ్, మున్సిపల్ వైస్చైర్మర్ గరుగు రాజు, గుండు గోపాల్, జయవంత్, నర్సింహగౌడ్, ఎస్ రామచందర్, చెన్నయ్యయాదవ్, షాబాద్ శ్యాం తదితరులు నివాళ్లు అర్పించారు.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్ మరణం విచారకరమని, హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం ప్రకటించారు. సామాజిక విలువలకు ప్రాధాన్యమిస్తూ, తనదైన శైలిలో దైవ సేవ చేయడం ద్వారా సౌందరరాజన్ ‘ప్రజాపూజారి’గా ప్రసిద్ధిగాంచారని కొనియాడారు. హిం దూ మత సంప్రదాయ విలువలను విశదీకరిస్తూ, దైవం ముందు సమానత్వ భావనతో ప్రజలకు ఆధ్యాత్మిక సేవలందించారని గుర్తుచేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సౌందరరాజన్ మృతితో దుఃఖంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, వారి అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిలుకూరు సౌందరరాజన్ మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సౌందరరాజన్ జీవితం నిరాడంబరతకు నిదర్శనమని, ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు సామాజిక సేవలోనూ తరించారని కొనియాడారు. మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుమారుడు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. సౌందరరాజన్ మృతి పట్ల బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సౌందరరాజన్ కుటుంబసభ్యులు, అభిమానులు, చిలుకూరి ఆలయ భక్తులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కూడా సంతాపం ప్రకటించారు.