Free Bus | నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోయిందని, ఫలితంగా కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతుందని అన్నారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉన్నదని ఆవేదన చెందారు. ప్రభుత్వం పునరాలోచించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కూడా ఆటో డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హనుమకొండ జిల్లా పరకాల, కమలాపూర్, నడికూడతోపాటు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆందోళనలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట రాస్తారోకో చేశారు. మిర్యాలగూడలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో చెన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్షుడు బత్తుల దేవరాజు, కార్మికులు ధర్నా చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి వేములవాడ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. రాయికల్ పట్టణంలో ఆటో, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లు ఆందోళన చేశారు. వీరికి సీపీఐ నాయకులు సుతారి రాములు, ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు ఆత్రం ఆనంద్ సంఘీభావాన్ని తెలిపారు. బీర్పూర్, కొడిమ్యాల మండల కేంద్రాల్లోనూ ధర్నా చేశారు. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు వందలాదిగా ఆటోలతో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు.
అనంతరం సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరాం మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో సుమారు 50 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల జీవితాలు చిగురించాలంటే ప్రభుత్వం వారికి నెలకు రూ.15 వేల జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్, నిజాంపేట, రామాయంపేట, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని న్యూ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దర్గా హజ్రత్ సయ్యద్ మిస్కీన్ షా ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు వద్ద హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై తెలంగాణ ఆటోస్ ప్యాసింజర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో నిరసన ర్యాలీ తీసి రాస్తారోకో చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
రంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల నిరసనలు తెలిపి ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని ఆర్టీసీ బస్సు ఎదుట ఏఐటీయూసీ అనుబంధ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండలాధ్యక్షుడు సగిర్ అహ్మద్ ఆధ్వర్యంలో, ఇచ్చోడలో సహారా జీప్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని అంతర్జాతీయ రహదారిపై తాంసి, తలమడుగు, ఆదిలాబాద్ మండలాల ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఖానాపూర్, కడెం, పెంబి ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు, డ్రైవర్లు ఆటో, టాటా మ్యా జిక్లతో కలిసి భారీ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆటోలు నడుపుకొంటూ ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదని అన్నారు. దీనివల్ల తమకు గిరాకీ లేక నష్టపోతున్నామని, కుటుంబ పోషణకు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రైవేటు వాహన కార్మికులు హెచ్చరించారు.