Auto Driver | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ) : ‘పిల్లల ఫీజులు ఎట్ల కట్టాలె? ఇల్లు అద్దె ఎల్లాలె? ఈ పాలన మాకొద్దు. హరీశన్నా.. బతకలేకపోతున్నం. ఆటో కిరాయి 200 కూడా వస్తలేవు. మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు.’ అంటూ ఆటో డ్రైవర్ మల్లయ్య మాజీ మంత్రి హరీశ్ వద్ద కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్ఎంపీ, పీఎంపీల మహాధర్నాకు హాజరైన హరీశ్‌రావు వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశాడు. పిల్లలను చదివించలేకపోతున్నామని, ఉచిత బస్సుతో గిరాకీ దెబ్బతిని ఉపాధి లేకుండా పోయిందని కన్నీటి పర్యంత-మయ్యాడు. ఉచిత బస్సుకు ముందు రోజుకు వెయ్యి నుంచి 1500 వరకు సంపాదించేవాళ్లమని..
కాంగ్రెస్ వచ్చాక 200 కూడా గిరాకీ కావడం లేదని వాపోయాడు. ఆటో కిస్తీలు కట్టలేక నరకం చూస్తున్నామని వివరించాడు. ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. చనిపోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెప్పాడు. తమ సమస్యలపై మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని హరీశ్‌ను కోరాడు. రోదిస్తున్న ఆటో డ్రైవర్‌ను హరీశ్‌రావు ఓదార్చి ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘సీఎం రేవంత్ గారూ.. ఆటో డ్రైవర్ మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్న తీరు నన్ను కలిచివేసింది. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రోడ్డున పడ్డ ఆటో కార్మికుల జీవితాలకు భరోసా కల్పించండి’ అని కోరారు.