KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్లే వర్షాలు, వరదలతో ప్రాణనష్టం సంభవించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించటం అన్యాయమని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, ఇండ్లు కోల్పోయిన, దెబ్బతిన్నవారికి రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి వాగ్దానం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 27నే భారీ వర్ష సూచన చేసిందని, అలెర్ట్‌గా ఉండాలని చెప్పిందని, కానీ, రాష్ట్రంలో కుంభకర్ణ నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయిందని దెప్పిపొడిచారు. రేవంత్ సరార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఓ యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ప్రాణాలు అని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఓ మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటడు.. మరో మంత్రి, ఈ రాష్ర్టానికి సీఎం లేనట్టు పక రాష్ట్ర సీఎంకు ఫోన్ చేస్తడు, ఇంకో మంత్రి ఫొటో ఫోజులకే పరిమితమవుతడు’ అంటూ దుయ్యబట్టారు. ‘నష్టం జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్.. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ప్రతిపక్షం ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు.
‘పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు హెలికాప్లర్లు, 150 పడవలు తెప్పిస్తే మరి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని హెలికాప్టర్లు, పడవలు తెప్పించిందో చెప్పాలి’ అని ఎక్స్‌లో కేటీఆర్ వ్యగ్యంగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ‘బిగ్ జీరో’ అంటూ ఎద్దేవాచేశారు.
‘భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో ఏర్పడిన పరిస్థితులు ఆవేదనకు గురిచేశాయి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా చర్యలు చేపట్టింది’ అంటూ రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌పై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో నిజంగా ప్రభుత్వం తరఫున సహాయక కార్యక్రమాలను చిత్తశుద్ధితో చేస్తున్నారో? లేదో? తెలుసుకుంటే ఇక్కడ మీ ప్రభుత్వ నిర్వాకం తెలుస్తుంది’ అంటూ రాహుల్‌కు చురకలంటించారు. ‘వరదల్లో చికుకున్న ప్రజలను దేవుడే కాపాడాలని ప్రభుత్వ పెద్దలే మాట్లాడుతుంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం?’ అంటూ నిలదీశారు. ఓ జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది ప్రాణాలు కాపాడారని చెప్పారు. ‘వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీచార్జీలతో హింసిస్తారా? సిగ్గు తెచ్చుకోండి’ అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
విపత్కర సమయంలో ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలు మేమున్నామంటూ భరోసా కల్పించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సేనని మరోసారి రుజువు చేశారని పార్టీ శ్రేణులను అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ఖమ్మం జిల్లా నాయకులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి చేస్తున్న కృషిని అభినందనీయమని పేర్కొన్నారు.
విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థంగా ఎదురోవచ్చని బీఆర్ఎస్ హయాంలో అమలుచేసిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) అక్షరాలా నిరూపించిందని కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి కాపాడటంలో ఎస్ఎన్డీపీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఎస్ఎన్డీపీ పనుల వల్లే వరద బాధ పోయిందని ప్రజలు చెప్పడం సంతృప్తినిస్తున్నదని పేర్కొన్నారు.
డెంగ్యూతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6000 డెంగ్యూ కేసులు నమోదైతే దాచిపెట్టిందని విమర్శించారు. 5 రోజుల్లోనే 800 డెంగ్యూ కేసులు నమాదైనట్టు ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డైరెక్టర్ నిర్ధారించిందని గుర్తుచేశారు.
గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలను వంచించడాన్ని రేవంత్ సరార్ మొదలు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు అంటూ ఊదరగొట్టి, ఇప్పుడు ఐదు నెలల బకాయిలు కట్టాలని ప్రజలపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి ఐదు నెలల బకాయిలు చెల్లించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. సరార్ నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తున్నదని విమర్శించారు. ‘నేతన్నలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరెల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్టకొట్టడం న్యాయమేనా? ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఉపాధి లేకుండా చేయడమేమిటి?’ అని ప్రశ్నించారు. నేతన్నలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన 16 ఏళ్ల రక్షిత అనే విద్యార్థిని నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కాలేజీ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనపై కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టల్లో చేరిన రెండో రోజే రక్షిత బాత్రూమ్లో శవమై కనిపించిందని, దుపట్టాతో ఉరి వేసుకున్నదని చెప్తున్నా, అంతకుముందు రాత్రి 8 గంటలకు తల్లితండ్రులతో ఫోన్లో మాట్లాడి అంతా బాగానే ఉన్నదని చెప్పిన అమ్మాయి తెల్లారేసరికి చనిపోవటం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని తల్లితండ్రులు వచ్చే వరకు ఉంచకుండా హడావుడిగా హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేయటం, సంఘటన జరిగిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ లేదని చెబుతుండటం అనుమానాలను మరింత బలపరుస్తున్నదని చెప్పారు. హడావుడిగా మృతదేహాన్ని తరలించటం, సీసీ ఫుటేజ్ మాయం చేయటంపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని చెప్పారు.
‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్‌ఖాన్ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్ కొనియాడారు. ఆయనకు ఫోన్‌చేసి అభినందించినట్టు సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. సుభాన్ఖాన్ను తాను త్వరలో కలుస్తానని వెల్లడించారు. ‘వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌ను ఎలా తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ చేష్టలుడిగితే, ధైర్యంగా ముందుకెళ్లి వారిని రక్షించిన సుభాన్‌ఖాన్ రియల్ హీరో.. నీ సాహసానికి సెల్యూట్’ అంటూ అభినందించారు.