హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్టలో విదేశీ కల్యాణాల పేరుతో జరిగిన అపచారం, అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. కల్యాణాల కోసం విదేశాలకు వెళ్లడమే కాకుండా, అక్కడ స్వామివారి విగ్రహాలను కారులో తీసుకెళ్తూ సీట్ బెల్ట్ వేసిన వ్యవహారాన్ని ససాక్ష్యంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించింది. దీనిపై ప్రభుత్వంతోపాటు దేవాదాయ శాఖ సీరియస్ అయింది. అసలు దేవస్థానం పేరుతో 2024-25లో జరిగిన కల్యాణాలపై ఆరా తీయగా చాలా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. విదేశీ కల్యాణాలకు సంబంధించి దేవస్థానం తరఫున వెళ్లినప్పటికీ అసలు దేవాలయానికి ఒక్కరూపాయి కూడా ఆదాయం లేకపోవడం, కల్యాణాల లెక్కలే ఉండకపోవడంతో ఆ అర్చక సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిర్ణయించారు. అయితే, అంతకుముందు అసలు ఎన్ని కల్యాణాలు జరిగాయో తేల్చడానికి ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ఆడిట్ ఆఫీసర్‌ను నివేదిక కోరింది. ఈ మేరకు సహాయ ఆడిట్ ఆఫీసర్ మంగళవారం దేవస్థానం ఈవో పేరుతో ఒక లేఖ పంపారు. ‘నమస్తే తెలంగాణ’ కథనంలో ప్రస్తావించిన అంశాలన్నింటినీ ఆ లేఖలో పొందుపరుస్తూ వీటిపై సమగ్ర నివేదిక వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వివరాలన్నీ ఇవ్వండి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో నిర్వహించిన కల్యాణోత్సవాల వివరాలు, నగదు పుస్తకం సమర్పించాలని, కల్యాణోత్సవాల మొత్తం సంఖ్య, నిర్వహించిన దేశాలు, నగరాల వివరాలు, వాటిని నిర్వహించిన స్థలాలు అంటే ఆలయాలు, ఫంక్షన్‌హాళ్లు, వ్యక్తిగత నివాసాల వివరాలు ఇవ్వాలని సహాయ ఆడిట్ ఆఫీసర్ పంపిన లేఖలో పేర్కొన్నారు. కల్యాణాలకు నిర్ణయించిన రుసుము, వాటి ఉత్తర్వుల కాపీలు ఇవ్వాలని, ప్రతి కల్యాణోత్సవానికీ వసూలు చేసిన రుసుములు, హుండీ విరాళాలు, విదేశీ కరెన్సీ వివరాలు తెలుపాలని, ఈ కల్యాణోత్సవాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం ఖాతాలో జమచేసిన వివరాలు, బ్యాంక్ చలాన్లు, రసీదులు సహా ఇవ్వాలని స్పష్టంచేశారు.
అంతేకాకుండా, విదేశాలకు వెళ్లిన అర్చకులు, సిబ్బంది పేర్లు, వారి హోదా, వారి పర్యటన కాలవ్యవధి, వారి పర్యటనకు జారీచేసిన ఆన్‌డ్యూటీ అనుమతి ఆదేశాల ప్రతులు సమర్పించాలని సహాయ ఆడిట్ అధికారి ఆదేశించారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన ప్రయాణ, వసతి, ఇతర ఖర్చుల వివరాలతోపాటు వాటిని ఎవరు చెల్లించారో తెలుపాలని సూచించారు. ముఖ్యంగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కారులో స్వామివారి చరమూర్తికి సీటుబెల్ట్ వేసిన ఫొటోను దృష్టిలో పెట్టుకున్న అధికారులు దేవస్థానం నుంచి విదేశాలకు తీసుకెళ్లిన చరమూర్తుల వివరాలు, వాటి తరలింపు, సంరక్షణ, తిరిగి దేవస్థానానికి అప్పగించిన వివరాలు ఇవ్వాలని సూచించారు. విదేశీ కల్యాణాలకు సంబంధించిన ఆదాయ ఖర్చుల సమగ్ర నివేదిక, నిర్వహణకు సంబంధించి శాఖాపరమైన అనుమతులు తీసుకున్న వివరాలు వెంటనే ఆడిట్ కోసం సమర్పించాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ ఆడిట్ అధికారి తన లేఖలో ఆదేశించారు.