హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పెద్దల పట్టింపులేనితనం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి పౌరసరఫరాలశాఖకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. అప్పులతో దినదినగండంగా పాలనను నెట్టుకొస్తున్నామని బీద అరుపులు అరుస్తున్న పాలకులకు.. సివిల్ సప్లయీస్ నిండా మునిగిపోతున్నా కనిపించడంలేదు. ఫలితంగా ఆ శాఖకు రావాల్సిన నిధులు రాక… వందల కోట్లు అడ్డగోలు వడ్డీల భారం మోయాల్సి వస్తున్నది. 5 నెలలుగా వేలం ధాన్యంపై, 8 నెలలుగా దొడ్డు బియ్యంపై ప్రభుత్వం నిర్ణయాన్ని నాన్చుతున్నది. దీంతో ప్రభుత్వం రూ.1452 కోట్లు నష్టపోయింది. రైతులకు ధాన్యం డబ్బులు, సన్నాల బోనస్ చెల్లించేందుకు నిధులు లేవంటూ.. బకాయిల వసూలులో జాప్యం ఎందుకు చేస్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సివిల్ సప్లయీస్‌కు వివిధ రూపాల్లో రూ.4,450 కోట్ల రావాల్సి ఉన్నది. ఇందులో వేలం ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు కాగా, మిగిలిపోయిన దొడ్డు బియ్యం బకాయిలు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి. 2022-23 యాసంగికి సంబంధించిన రూ.7,600 కోట్ల విలువైన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. వేలంలో టెండర్ దక్కించుకున్న బిడ్డర్లు 16 నెలలైనా ధాన్యం ఎత్తలేదు.. సర్కారుకు పైసలు చెల్లించలేదు. సగం ధాన్యమే ఎత్తి, మిగిలిన ధాన్యం ఎత్తకుండా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. టెండర్ల రద్దు ద్వారా సుమారు 20 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. తద్వారా సివిల్ సప్లయీస్‌కు రావాల్సిన రూ.4వేల కోట్ల నిధులు ఆగిపోయాయి. జూన్‌లో ప్రభుత్వం ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఐదు నెలలు గడిచినా మిగిలిన ధాన్యంపై నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పెద్దల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో అసలుతోపాటు వడ్డీల భారం పడుతున్నది. ఇప్పటికే రూ.1,452 కోట్లు వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే మరింత భారం తప్పదని అధికారులే చెప్తున్నారు.
బకాయిల వసూలుపై ప్రభుత్వ నిర్లక్ష్యంతోపాటు దొడ్డు బియ్యంపైనా అలసత్వం కొనసాగుతున్నది. ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది. అప్పటికే రేషన్ షాపుల్లో, గోదాముల్లో 1.4 లక్షల టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉండిపోయాయి. సన్న బియ్యం పంపిణీతో వాటిని ఉపయోగించడంలేదు. సన్న బియ్యం పంపిణీకి ముందే మిగిలిన స్టాక్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దొడ్డు బియ్యం 8 నెలలుగా రేషన్ షాపులు, గోదాముల్లోనే మురిగిపోతున్నాయి. వీటికి పురుగులు పట్టి, పనిరాకుండా పోతున్నా పౌరసరఫరాలశాఖ పట్టించుకోవడంలేదు. దొడ్డు బియ్యాన్ని కేజీ రూ.24 చొప్పున విక్రయించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒక్క గింజను కూడా విక్రయించలేదు. మిగిలిపొయిన 1.4 లక్షల టన్నుల దొడ్డు బియ్యం విలువ కనీసం రూ.450 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ విధంగా వేలం ధాన్యం, దొడ్డు బియ్యం కలిపి సివిల్ సప్లయీస్‌కు రావాల్సిన రూ.4,450 కోట్లు రావడంలేదు.