మెట్పల్లి రూరల్, డిసెంబర్ 1 : మొదటి విడత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో నిలిచాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ని ఓ గ్రామంలో సోమవారం జరగ్గా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలోని ఓ గ్రామ సర్పంచ్ స్థా నాన్ని బీసీ జనరల్‌కు కేటాయించగా, 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇందులో ఓ అభ్యర్థికి మరో సామాజికవర్గం పూర్తి మద్దతు ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. దీంతో గ్రామంలోని 17 కుల సంఘాల సభ్యు లు సోమవారం సమావేశమై మిగతా 11 మంది అభ్యర్థులతో చర్చలు జరిపారు. ఓట్లు చీల కుండా 11 మందిలో ఒక్కరే పోటీలో ఉండాలని వేలంపాట నిర్వహించగా, రూ.28.60 లక్షలకు ఓ అభ్యర్థి దక్కించుకున్నాడు. మిగిలిన పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసింది.