హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులకు నిధుల్లేక ఆ పనులు ముందుకు సాగడంలేదు. దీంతో ఆ పనులను పట్టాలెక్కించేందుకు కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్లోని భూములను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా కోకాపేట నియోపోలిస్లో 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లను వేలం వేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నది.
ఒక్కో ఎకరానికి రూ.99 కోట్ల ఆఫ్సెట్ ధరను నిర్ణయించింది. ఆ లెక్కన ఎకరానికి రూ.140-150 కోట్లు రావచ్చన్న అంచనాతో మొత్తంగా రూ.5 వేల కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నాలుగు దశల్లో నిర్వహించే ఈ వేలం ఈ నెల 24న ప్రారంభం కానున్నది. భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయంతో పెండింగ్లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్, రేడియల్ రోడ్ల పనులను ప్రారంభించాలని రేవంత్రెడ్డి సర్కారు భావిస్తున్నది. కానీ, ఈ రెండు ప్రాజెక్టులను భూసేకరణ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనితోపాటు పరిహారం విషయం ఇంకా తేలలేదు.