Sircilla | రాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైనే దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగారు. కార్యాలయం బయట ఉన్న వాహనాలను విచక్షణారహితంగా ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపైనే పోలీసులు లాఠీచార్జికి దిగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సహా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు అధికారులను ప్రశ్నిస్తూ వస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం కలెక్టర్ అంటూ, ఆయన వ్యవహార శైలిపై ఇరువర్గాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉన్నదంటూ రెండురోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత రెండు రోజలకే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెడతామంటూ సవాల్ చేస్తూ సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం తరలివచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను వారించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులపై తిరగబడి దాడికి యత్నించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఇన్నోవా వాహనం అద్దాలను ధ్వంసం చేయడం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల తోపులాటను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల లాఠీదెబ్బలకు 13 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.
పోలీసుల లాఠీచార్జిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఎడమ చెయ్యి విరిగింది. మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్, తంగళ్లపల్లి మండల కార్యకర్తలు చంటి యాదవ్, కోడూరి భాస్కర్‌గౌడ్, బండి రమేశ్, సిరిసిల్లకు చెందిన గడ్డం భాస్కర్, బింగి ఇజ్జగిరి తదితరులు పోలీసుల లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలయ్యారని కూడా చూడకుండా వారందరినీ అదుపులోకి తీసుకొని తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం క్షతగాత్రులను నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు పరామర్శించారు. ప్రైవేటు దవాఖానకు తరలించి వారికి వైద్యం చేయించారు. పోలీసుల లాఠీచార్జి ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ప్రజాపాలన కాదని, రాక్షస పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని విమర్శించారు. సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసేందుకు బరితెగించిన కాంగ్రెస్ గూండాలను అదుపు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై విచక్షణా రహితంగా లాఠీలతో చితకబాదారని మండిపడ్డారు.
ప్రజల్లోకి రావడానికి సోయిలేని సీఎంను లోకమంతా మరిచిపోతుందన్న భయంతో, కాంగ్రెస్ నేతలే ఆయన ఫొటోలను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులపై కేకే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో దాడులకు ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. కేకే తానా అంటే కలెక్టర్ సందీప్‌కుమార్ తందానా అంటూ కాంగ్రెస్‌కు వంత పాడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపిన కేటీఆర్‌కు రాజ్యాంగబద్ధంగా చెందాల్సిన హక్కులను.. కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు చీటి నర్సింగరావు, ప్రవీణ్ పాల్గొన్నారు.