Congress Govt | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : పాలనలో వైఫల్యం.. హామీలు అమలుచేయలేని నిస్సహాయత.. ఎండుతున్న పంటలు.. నిత్యం అన్నదాతల బలవన్మరణాలు.. ఏడాదిన్నర కూడా గడవకముందే ప్రభుత్వంపై తిరగబడుతున్న ప్రజలు, ఉద్యోగులు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేల్చిన ఓ సర్వే.. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం రేవంత్‌రెడ్డి నోరు జారుతూ మాజీ సీఎం, ఉద్యమ నేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. దీనిపై అటు గులాబీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం..వీటన్నింటి నుంచి అటు ప్రతిపక్షం, ఇటు ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ సర్కారు తన మార్కు అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు తెరతీసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీలో ప్రజా సమస్యలేవీ చర్చకు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అంశాన్ని వివాదాస్పదం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసి ప్రతిపక్షాల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయబోం అని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం మాటపై నిలవని కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉంటే ప్రభుత్వాన్ని కడిగిపారేయడం ఖాయమన్న భయంతోనే కాంగ్రెస్ సర్కారు సస్పెన్షన్ అస్ర్తాన్ని ఎంచుకున్నదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ సస్పెన్షన్ల పరంపర ఒక్క జగదీశ్రెడ్డితోనే ఆగదని, మరికొందరు బీఆర్ఎస్ సభ్యులు లక్ష్యంగా కొనసాగే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కారును అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టాయి. సామాన్య ప్రజలు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఇలా దాదాపు అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమవుతున్నారు. హామీల అమలుపై నిలదీస్తామని అంటున్నారు. ఓవైపు పాలనలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతుండగా, దీనికి తోడు ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పట్ల ప్రజలకున్న భ్రమలు తొలగుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 21 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాలు కాంగ్రెస్ సర్కారులో వణుకు పుట్టించినట్టు తెలుస్తున్నది. దీనిపై పార్టీ అధిష్ఠానం పెద్దలు అసహనంతో ఊగిపోయినట్టు సమాచారం. వీటి నుంచి దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై చావు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. కాగా ఈ వ్యాఖ్యలు ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో పథకాలు అమలు చేయడం సాధ్యం కావడం లేదనే విధంగా మాట్లాడారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. హామీలు అమలు చేయలేమని తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. హామీలు ఇచ్చే ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. హామీలిచ్చి వాటితో గద్దెనెక్కి.. ఇప్పుడు మావల్ల కాదంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగులు సైతం సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత నానాటికీ పెరుగుతుండటంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీరు లేక అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు రుణమాఫీ చేయకపోవడం, రైతుభరోసా ఎగ్గొట్టడంతో ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ వారి తరపున సర్కారుపై యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సమస్యలపై ఎండగట్టేందుకు సమాయత్తమైంది. ప్రజా, రైతు సమస్యలు అసెంబ్లీలో చర్చకు వస్తే సమాధానం చెప్పుకోలేని స్థితిలో సర్కారు ఉంది. ఇదే జరిగితే తమ బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ కూడా ఇందులో భాగమని పేర్కొంటున్నారు.