శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:10

ధరలు పెంచినవారిపై దాడులు

ధరలు పెంచినవారిపై దాడులు

  • 3,424 కేసులు, కోటికిపైగా జరిమానా
  • హైకోర్టుకు వెల్లడించిన పౌరసరఫరాలశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయించిన వారిపై విస్తృత దాడులు చేశామని పౌరసరఫరాలశాఖ హైకోర్టుకు తెలిపింది. పౌరసరఫరాలశాఖ, తూనికలు, కొలతల శాఖ వేర్వేరుగా దాడులు జరిపి 3,424 కేసులు నమోదుచేసి రూ. కోటికి పైగా జరిమానా విధించాయని పేర్కొన్నది.  లాక్‌డౌన్‌ సాకుతో   కొందరు వ్యాపారులు ధరలు పెం చుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోమారు విచారణ జరిపింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నారన్న సమాచారంతో 20,530 చోట్ల పౌరసరఫరాలశాఖ తనిఖీలు నిర్వహించిందని, 1,166 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.33.50 లక్షల జరిమానా విధించిందని పేర్కొన్నారు. తూనికలు, కొలతలశాఖ ఆధ్వర్యంలో 15,901 చోట్ల తనిఖీలు చేపట్టి 2,258 కేసులు నమోదు చేశామన్నారు. తూనికలు కొలతలశాఖ రూ.76.98 లక్షల జరిమానా విధించినట్టు నివేదించారు. ప్రభుత్వ చర్యలపట్ల సంతృప్తి  వ్యక్తం చేసిన ధర్మాసనం కేసు విచారణను ముగించింది.  logo