హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ విషయాన్ని పట్టించుకోని పోలీసులు.. సీఎం బంధుగణానికి మాత్రం 24 గంటల భద్రత కల్పించడంలో తలమునకలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మామ పద్మారెడ్డి ఇంటికి భద్రత ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
జూబ్లీహిల్స్‌లోని పద్మారెడ్డి ఇంటివద్ద ఏర్పాటు చేయాల్సిన భద్రత, అందుకు అధికారికంగా చేయాల్సిన లాంఛనాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. పైనుంచి ఆదేశాలు రాగానే ఆయన ఇంటి వద్ద 24/7 భద్రత ఉండేలా గార్డ్ విజన్ సహా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. మెన్ అండ్ మెషీన్ సహా అన్ని వివరాలతో కూడిన ఫైల్ ఇప్పటికే డీజీపీకి చేరిందని సమాచారం. ముఖ్యమంత్రి మామ పద్మారెడ్డి ఇంటి భద్రతకు నెలకు రూ. 5 లక్షలు అవుతుందని అంచనా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై వరుసగా దాడులు జరుగుతున్నా కనీస ఏర్పాట్లు చేయని పోలీసు యంత్రాంగం సీఎం మామ ఇంటి విషయంలో మాత్రం చకచకా ఏర్పాట్లు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.