దేవరుప్పుల, జనవరి 14 : కాంగ్రెస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పేర నిరంకుశ పాలన నడుపుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. నిత్యం ప్రజల్లో తిరిగే జర్నలిస్టులను పోలీసులు అప్రజాస్వామ్య పద్ధతిలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నోటీసులు ఇవ్వకుం డా ఇండ్లపై దాడులు చేసి తలుపులు పగులగొట్టి క్రిమినల్స్ మాదిరిగా లాక్కెళ్లడం దారుణమని అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కనీసం పండుగని చూడకుండా వారిని అరెస్ట్ చేయడం, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేయడమేమిటని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్ట్‌లు సరికాదు: సత్యవతి
మహబూబాబాద్ రూరల్, జనవరి 14 : ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. తెలంగాణ ఉద్యమకారులు, జర్నలిస్టులను ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. మీడియా అనేది ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వారు ఆగుతారా? అని ప్రశ్నించారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని మీడియాను భయపెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు.
ప్రజాస్వామ్యమా? ఎమర్జెన్సీ పాలనా?: పల్లా
జనగామ, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతున్నదా? ఎమర్జెన్సీ నడుస్తున్నదా? అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్ అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా మంత్రులపై టీవీ చానళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకొని తిరిగి వారిపైనే సిట్ వేసి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.