మంచిర్యాల, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లో నిర్మిస్తున్న ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి భూ నిర్వాసితులు, మహిళల నుంచి నిరసన ఎదురైంది. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని తహసీల్ కార్యాలయ సమీపంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌వెంకటస్వామిని భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా తమ భూములును లాక్కొని, ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. కలెక్టర్ కుమార్ దీపక్ కల్పించుకొని ఇవి ప్రభుత్వ భూములని, మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్లనే అడగాలని సూచించారు. చెన్నూర్ పట్టణంలో పలు వార్డుల్లో తాగునీరు, రోడ్లు, కనీస వసతులు లేవని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని మంత్రి వివేక్ ఎదుట స్థానిక మహిళలు వాపోయారు.
అమరచింత, జనవరి 19 : మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన తెగ తగిలింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోమవారం మంత్రి వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, ఆరు గ్యారెంటీలు అమలు కావడంలేదని, కల్యాణలక్ష్మి తులం బంగారం ఇవ్వడంలేదంటూ పలువురు మహిళలు మంత్రిని నిలదీశారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. తాను రెండేండ్లుగా రూ.వందల కోట్ల నిధులను తెచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఇలా నిలదీయడం సరికాదని చెప్పారు. కొందరు విలేకరులు ఇలా నిలదీసిన వార్తలను రాయడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీసి మరిన్ని నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు.
వర్ధన్నపేట, జనవరి 19 : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ దవాఖానను వేరే ప్రాంతానికి తరలించడంపై కలెక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానను ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్దకు తరలించేందుకు ఇటీవల కలెక్టర్, ఎమ్మెల్యే కొత్త భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. అప్పటి నుంచి వర్ధన్నపేటకు చెందిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, యువకులు దవాఖాన సాధనాసమితిగా చేరి నిరసన దీక్షలు చేస్తున్నారు. సోమవారం వర్ధన్నపేటలో ఇందిరమ్మ చీర లు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్, ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు దవాఖాన తరలింపుపై కలెక్టర్, ఎమ్మె ల్యే ఎదుట నిరసన వ్యక్తంచేశారు. దవాఖానను వర్ధన్నపేట పట్టణంలోనే కొనసాగించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు తప్ప అర్హులైన పేదలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పట్టణంలో చాలా వార్డుల్లో సీసీరోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను సముదాయించేందుకు పోలీసులు, అధికారులు యత్నించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో సమావేశాన్ని వెంటనే పూర్తి చేసి ఎమ్మెల్యే నాగరాజు వెళ్లిపోయారు. పోలీసులు మహిళలను శాంతింపజేసి బయటకు పంపించారు.
మహబూబాబాద్ రూరల్, జనవరి 19: ‘ఓట్లయితే వేయించుకున్నావు గానీ మా కాలనీకి ఏం చేసినవ్.. రెండేండ్లకు ఇప్పుడా వచ్చేది’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌ను తండావాసులు నిలదీశారు. సోమవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు ఏటిగడ్డతండాలో సైడ్ డ్రైనేజీ నిర్మాణ శంకుస్థానకు వచ్చిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులను తండా మహిళలు నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గల్లీగల్లీకి తిరిగి అన్ని కాలనీలకు రోడ్లు వేయిస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని ఒక్కసారి కూడా తిరిగి చూడలేదని మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు సైతం రాలేదని, ఇప్పుడు ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలనీలో నీళ్లు రావడంలేదని, రోడ్లు మొత్తం రాళ్లు తేలినా పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వచ్చారా అంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి.. మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.