వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తులు వాపస్
వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం-2011లో పలు కీలక మార్పులు చేసింది.
- గిఫ్ట్ డీడ్‌లే కాదు.. రిజస్ట్రేషన్ చేసినవి కూడా
- వృద్ధుల సంరక్షణ చట్టానికి రాష్ట్ర సర్కారు సవరణ
- దేశంలోనే మొదటిసారి అమలుకు చర్యలు
- నిర్ణీత గడువులో పరిష్కరించేలా మార్గదర్శకాలు
- ఉత్తర్వుల అమలుకు ఆర్డీవోలకు అధికారాలు
- ఇకపై ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుకు అవకాశాలు
- పెను విప్లవానికి బీఆర్ఎస్ సర్కారు నాంది
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం-2011లో పలు కీలక మార్పులు చేసింది. సంరక్షణను పట్టించుకోని తమ పిల్లల నుంచి ఇప్పటి వరకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఆస్తులనే తీసుకొనే అవకాశం ఉండగా, తాజా గా ఇకపై రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులనూ తిరిగి తమ పేరిట బదలాయించుకునేలా చట్టాన్ని సవరించింది. అదీగాక ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ఆర్డీవోలకు అధికారాలను కట్టబెట్టింది.
సవరణలోని కీలకాంశాలు:
- తల్లిదండ్రులు, వృద్ధుల మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లోనే ఆస్తుల బదాలయింపు అంశం కూడా ఉండేది. ఆర్డీవోనే ఫిర్యాదులను స్వీకరించేవారు. అక్కడ న్యాయం జరగకపోతే అప్పిలేట్ అధికారి అయిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకొనే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆర్డీవో వద్ద మెయింటెనెన్స్ ఫిర్యాదులను మాత్రమే స్వీకరించనున్నారు.
- ఆస్తుల బదలాయింపు అంశాన్ని పరిష్కరించే బాధ్యతను కలెక్టర్‌కు బదలాయించారు. ఇకపై తొలుత నేరుగా కలెక్టర్‌కే దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ న్యాయం జరగకపోతే అప్పీలేట్ అధికారి/వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి.
- ఇప్పటి వరకు ఆస్తులను తిరిగి తల్లిదండ్రుల పేరు మీదకు బదలాయించేందుకు అనేక కారణాలను చూపాల్సి ఉండేది. ప్రస్తుతం అలా కాకుండా పిల్లలు తమను సరిగా చూసుకోవటం లేదని చెప్తే చాలు ఆస్తులను వెనక్కి బదలాయిస్తారు.
- జీవన భృతిని పెంచాలని కోరుతూ తల్లిదండ్రులు, వృద్ధులు తిరిగి ట్రిబ్యునల్లను ఆశ్రయించవచ్చు.
- ఇంతకుముందు మెయింటెనెన్స్, ఆస్తుల బదలాయింపు అధికారాలను చట్టం పోలీసులకు కట్టబెట్టింది. అయితే పోలీసులు నేరుగా జోక్యం చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆ అధికారాలను ప్రస్తుతం ఆర్డీవో, కలెక్టర్‌కు కట్టబెట్టారు. వారు పోలీసులకు ఉత్తర్వులను జారీ చేసి ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తారు.
- తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం-2011 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధులను నిరాదరణకు గురి చేసినా, జీవన భృతి కల్పించని పిల్లల నుంచి గిఫ్ట్‌గా రాసిచ్చిన ఆస్తులను మాత్రమే ఇప్పటివరకు వెనక్కి తీసుకొనే అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతం ఆ గిఫ్ట్ డీడ్ ఆస్తులతో పాటు, రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను కూడా వెనక్కి తీసుకొనేలా చట్టాన్ని ప్రభుత్వం సవరించింది.
- ఇప్పటి వరకు ట్రిబ్యునల్‌లో దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి గతంలో నిర్ణీత కాలపరిమితి లేదు. ప్రస్తుతం 90 రోజుల్లోగా పరిష్కరించాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరో 30 రోజులు పొడగించవచ్చు.
- ఆస్తుల బదలాయింపు ఫిర్యాదులపై 15 రోజుల్లోగా కలెక్టర్ స్పందించాలి. నిజానిజాల నిర్ధారణకు సదరు ఫిర్యాదును ఆర్డీవోకు పంపించాలి. కలెక్టర్ ఉత్తర్వులు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి 60 రోజుల్లోగా ఆర్డీవో తన నివేదిక కలెక్టర్‌కు అందజేయాలి.
- www.tsseniorcitizens.cgg.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదులను తీసుకొనేలా చర్యలు చేపట్టింది. పోర్టల్‌లోనే దరఖాస్తు ఫారాలు, నిబంధనలు, ఇతర మార్గదర్శకాలను పొందుపరుస్తున్నది.
హెల్ప్ లైన్ కాల్స్ ఆధారంగా..
వయోవృద్ధుల కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్ 14567 సేవలకు 2019లో శ్రీకారం చుట్టింది. ఆ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ను విశ్లేషించగా 46 శాతం మంది వృద్ధ మహిళలు, 54 శాతం మంది వృద్ధ పురుషులు వేధింపులకు గురవుతున్నట్టు గుర్తించింది. మొత్తం కాల్స్‌లో 39 శాతం నిరాదరణకు, 18 శాతం ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నామని ఆశ్రయిస్తున్నవేనని అధికారులు గమనించారు. వృద్ధులను వేధింపులను గురిచేస్తున్న వారిలో కొడుకులు 56 శాతం, కోడళ్లు 13 శాతం, కూతుళ్లు 7 శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.
ఆస్తి లాక్కొని తల్లిదండ్రులను గెంటేస్తున్నవారున్నారు..
తిండి పెట్టకుండా నరకం చూపించిన కొడుకులున్నారు..
సూటిపోటి మాటలతో క్షోభకు గురిచేసినవారున్నారు..
అంత్యక్రియలకు కూడా రాని కఠినాత్ములున్నారు..
వీళ్లందరికీ గడ్డి పెట్టేలా, వృద్ధులకు ఊతమయ్యేలా..
తెలంగాణ సర్కారు పెను విప్లవానికి నాంది పలికింది!
ఆస్తులను వెనక్కి తీసుకొనే చట్టం తెచ్చి చరిత్ర సృష్టించింది!!
కొడుకులు, కూతుళ్లను దారిలో పెట్టే బాధ్యత తీసుకొన్నది!!!
వేధిస్తే చర్యలు తప్పవు
వృద్ధులు సంతోషకరమైన జీవనాన్ని గడిపేందుకు కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం చేపడుతున్నది. వృద్ధుల భద్రత, సంక్షేమం, హకుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్స్ సిటిజన్స్ చట్టంలో పలు సవరణలు చేసింది. వృద్ధులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. హెల్ప్‌లైన్‌పై, చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి.
– పార్థసారథి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజెన్స్ కౌన్సిల్ సభ్యుడు
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధులు ఎవరి నుంచి, ఏవిధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా సంప్రదించాలి. ప్రతి ఒక్కరు వృద్ధులను ప్రేమతో చూడాలి. వృద్ధులను ఇబ్బందికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు. -కమిషనర్ శైలజ

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

